పుట:PadabhamdhaParijathamu.djvu/825

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేతు - చేతు 799 చేతు - చేతు

  • "చేతు లారంగ శివునిఁ బూజింపఁడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడువఁడేని..." భాగ. 10.

చేతులార చేసుకొను

  • స్వయంగా తెలిసి తెలిసీ చేసుకొను.
  • "చేతులారా చేసుకొన్న దానికి అనుభవించక తప్పుతుందా?"
  • చూ. చేజేతుల జేసుకొను.

చేతులు కట్టుకొని

  • వినయంతో. చేతులు కట్టుకొని కూర్చుండుట వినయసూచకం.
  • "వీళ్ళంతా యిక్కడ యిన్ని మాటలు మాట్లాడుతారు గానీ, రెడ్డిగా రొచ్చేసరికి చేతులు కట్టుకొని నిల్చుంటారు." వా.

చేతులు కడుగుకొను

  • సంబంధము వదలుకొను. చేతులు కడుగుకొనుట ఏదో పని ముగించుటను తెలుపును.
  • "ఈ పిల్లను అత్తవారింటికి పంపించి చేతులు కడుక్కొని, కాశీకి వెళ్ళి పోదా మనుకున్నాను." వా.

చేతులు కావు, కాళ్ళు

  • ప్రాధేయపడునప్పుడు అను మాట.
  • పట్టుకోవడం చేతులనే అయినా కాళ్లు పట్టుకున్నట్లు భావించు మనుట.
  • "నీ వెలాగో ఈ పని చేసి పెట్టాలి. చేతులు కా వివి కాళ్లు. వాడిమీద కోపం మానివేసెయ్." వా.

చేతులు తీయు

  • చేతులు నొప్పి పెట్టు.
  • "నిరస్తచాపుఁ డై, చేతులు తీయఁగా మరుఁడు సెజ్జపయిం బడు." నిరంకు. 2. 11.
  • "ఈ రోజు రాసి రాసి చేతులు తీస్తున్నాయి." వా.
  • దీనిపై వచ్చినవే చేతుల తీపులు, కాళ్ల తీపులు.

చేతులు నెత్తిమీదికి వచ్చు

  • దిగులు కలుగు. దిగులుగా ఉన్నప్పుడు కూర్చొని రెండుచేతులతో తల పట్టుకొనడం అలవాటు. అందుపై వచ్చినది.
  • "ఆ వ్యాజ్యం పోవడంతో వాడికి చేతులు నెత్తిమీదికి వచ్చాయి." వా.

చేతులు పట్టి పల్కు

  • అబ్బురముగా చెప్పుకొను.
  • "చానలు చేతులు పట్టి పల్కఁగన్." రాధి. 3. 79.

చేతులు పిసుకుకొను

  • ఏమి చేయుటకూ తోచక పోవు.
  • "భాగ్యదేవతలార! యీబారి గడవఁ, బెట్టరే యంచుఁ జేతులు పిసికికొనుచు." ఉత్త. హరి. 7. 185.

చేతులు బయలూచు

  • ఊరక చేతు లాడించు.
  • "గుఱు పొడుచువారు... చేతులు బయ లూఁచువారు." భాస్క. యుద్ధ. 276.