పుట:PadabhamdhaParijathamu.djvu/794

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెడ్డ - చెత్తా 768 చెద - చెన

చెడ్డయింటి చెదార మగు

  • 1. సంస్కారము లేక, చూచే దిక్కు లేక గాలికి పెరుగు. కాశీ. 4. 91.
  • 2. ఎవరి పోషణా లేక తనకు తానుగా పెరుగు.
  • "చెడ్డ యింటి చెదార మై శివుని కరుణ, నివ్వటిలు నిర్వదేనేండ్ల నిన్నుఁ దలఁచి." కాశీ. 4. 91.

చెడ్డ యొట్టు

  • సరిపడని సంగతి.
  • "కొఱపము చెడ్డ యొట్టు." హంస. 4. 41.
  • చెడ్డ యొట్టువలెనే బహిష్కృత మనుట.

చెడ్డ సరదా

  • ఎక్కువ సరదా. మాటా. 1.

చెత్తగొడుగు

  • గడ్డితోనో, ఎండిన ఆకుల తోనో చేసిన గొడుగు.
  • "జాఱు బొజ్జయు నునుదబ్బ సంబెళయును, జెత్తగొడుగును జక్కఁ దాల్చి." హర. 7. 12.

చెత్తాకానీ రకం

  • చౌకబారు రకం.
  • "వాళ్ల దంతా చెత్తాకానీరకం." వా.
  • "ఈ చెత్తాకానీ రకం కుర్చీ లెక్కడ దొరికాయి రా." వా.

చెత్తా చెదారం

  • చెత్త. జం.
  • "ఈ చెత్తా చెదారం అంతా తుడిచే సరికి నాలుగురోజు లవుతుంది." వా.

చెద పట్టిన

  • పాత పడిన; చెదలుపట్టి పాడయిన. నిరసనగా అను మాట. జగ. 117.

చెదపురువునుంబోలె విదలించు

  • నీచముగా చూచు.
  • "ఆకటఁ గటకటంబడి గ్రాసంబు వేఁడినఁ జెద పురువునుంబోలె విదలించు వారలే గాని యాయాసం బెఱింగి ర మ్మనువారు లేరు..." శుక. 3. 187.

చెదరబడు

  • చెదరి పడు.
  • "రాలిన భూషణాలిఁ జెదరంబడి యున్న శతాంగకోటినా,భీలత నొందె నారణము." భాస్క. రా. యు. 1. 182.

చెదర బాఱు

  • 1. వ్యాపించు.
  • "చెదరం బాఱు దశప్రభంజనములన్ శిక్షన్ సుషుమ్నంబునన్, గుదియం బట్టి." సర్వే. శ. 48.
  • 2. చెదరి పడు. చంద్రా. 5. 68.

చెనటి పిసాళి వెచ్చములు

  • దుర్వ్యయములు, దుబారా ఖర్చులు.
  • "...అనృతోప పన్నమున్, జెనటి పిసాళి వెచ్చములఁ జేర్చుచు...." పాండు. 3. 19.