పుట:PadabhamdhaParijathamu.djvu/786

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చెక్కి - చెక్కి 760 చెక్కి - చెక్కు

  • "కన్నులు చేరుచుకొంచుఁ జెక్కిట, న్గట్టిగ నద్దుకొంచుఁ దనగాటపుఁ గూరిమి దెల్పె మిక్కిలిన్." కళా. 4. 121.

చెక్కి పుచ్చు

  • చెక్కు.

చెక్కిలి గొట్టి పాలు ద్రాగించు

  • కాస్త కష్టం కలిగించినా వారి మేలుకోస మయ్యే పని చేయు.
  • పిల్లలను ఒక చెంపను దెబ్బకొట్టి అయినా సరే పాలు తాగించడం పిల్లల శ్రేయస్సుకే అనుట ప్రసిద్ధము.
  • "ఇంచుకయేని వేసరక యీగయిఁ జెక్కిలి గొట్టి పాలు ద్రా,గించువిధంబునన్ బలిమిఁ గేశవ! నీవు..." కళా. 8. 247.

చెక్కిలి గొట్టి పాలు ద్రాగించు నట్లు

  • దండించి మంచిపని చేయించు నట్లు.
  • "ఎంచఁగఁ గౌశికుండు యిల నీగఁగ రాని ఋణంబు దీర్ప నన్, బంచి కలంచు టెల్ల యది బాలునిఁ జెక్కిలి గొట్టి పాలు త్రా,గించినలీలగాఁ దలఁతు." ఉత్త. హరి. 1. 63.
  • చూ. చెక్కిలిమీటి పాలు ద్రావించునట్లు.

చెక్కిలి నొక్కు

  • ప్రేమాదరములతో చెంప పై కొట్టు, లఘుచపేటము నిచ్చు, బుగ్గ పుణుకు. ఒక ప్రేమసూచక మైన చేష్ట.
  • "చెక్కిలి నొక్కి చుంబనము చేసి కవుంగిట నోలలార్చి." కళా. 7. 162.
  • "సరోజాక్ష! నా, కళుకుం జెక్కిలి నొక్కి యొక్క నెలవంకన్ నెక్కొనం జేయుటల్." రాజగో. 4. 33.

చెక్కిలి మీటి పాలు ద్రావించు నట్లు

  • ప్రేమతో దండించి మంచిపని చేయించునట్లు.
  • "బాలు చెక్కిలి మీటి పాలు త్రావించి, బాలు రక్షింపదె బాలుని తల్లి." ప్రభులిం. 14. 115.
  • "శిశువులు వాపోవఁ జెక్కిలి మీటి, విశ దాత్మ పాలు ద్రావించు చందమున." హరి. ద్వి. 2 భా. 195.
  • చూ. చెక్కిలి గొట్టి పాలు ద్రాగించు.

చెక్కు గట్టు

  • పైభాగం గట్టిపడు.
  • ముఖ్యంగా ద్రవంగానో, మెత్తగానో ఉన్నవి ఆరగా పైన చెక్కు లాగా యేర్పడుతుంది. దానినే చెక్కు గట్టుట అంటారు.

చెక్కు గీటిన వస వల్చు

  • బాల్యంలో ఉండు.
  • చిన్నప్పుడు వస పోస్తారు. అలా గీరితే వస పైకి వచ్చే వయసు - బాల్యం - అనుటపై వచ్చినది.