పుట:PadabhamdhaParijathamu.djvu/738

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చిక్కు - చిక్కు 712 చిక్కె - చిగి

చిక్కులు గొను

  • చిక్కువడు.
  • "చెదరిన పత్త్రభంగములఁ జిక్కులు గొన్న మణీసరంబులన్." పారి. 4. 18.

చిక్కులు వాపు

  • చిక్కు తీయు.
  • "కొనగోళ్ల నెఱులు సిక్కులు వాపి." పారి. 2. 12.
  • "అంకపీఠముం జేరిచి సోగవెండ్రుకలఁ జిక్కులు వాపి." పారి. 4. 8.

చిక్కువడు

  • చిక్కుకొను.
  • "చిక్కువడియును మదిఁ జేవ చెడ కతండు." జైమి. 5. 12.
  • "శోకమోహంబుల సుడిఁ జిక్కు వడక." వర. రా. కిష్కి. పు. 353. పంక్తి. 16.

చిక్కువర్చు

  • చిక్కులలో పెట్టు.
  • "వాడు నన్ను చాలా చిక్కుపరచి నాడు." వా.
  • "చిక్కయ్య లింగయ్యఁ జిక్కువర్చితివొ." పండితా. ద్వితీ. మహి. పు. 214.
  • ఇక్కడ కించపరుచు, చిన్న చూపు చూచు అనే అర్థంగా కానవస్తుంది.

చిక్కు సీరై పోవు

  • చెదరి పోవు.
  • "చిన్నైన యాట లెల్ల సిక్కు సీరై పోవు." తాళ్ల. సం. 3. 15.

చిక్కె గుమ్మడు

  • దొరికాడు లే అబ్బాయి ! అనుట వంటిది.
  • "చిక్కె గుమ్మఁ డటంచు నలరి." వర. రా. బా. పు. 51. పంక్తి. 7.

చిక్కొట్టు

  • చీకొట్టు.
  • "ఇక్కన్యకు మగఁడే యితఁ, డక్కట యీ మగని కేటి యా లిది యనుచుం, జిక్కొట్ట వలదు..." ఉత్త. హరి. 5. 147.

చిగరుగోరు

  • అర్థం విచార్యం.
  • 'జుట్టుముడి బిగించుట కుపయోగించు సాధన విశేష' మని వావిళ్ళ ని.
  • "చిగరుగోళ్ళను జాఱు సిగ నిక్కఁగా వేసి, గదలి పూ రేకులు గానఁ జెరివి." మల్హ. 3. 9.

చిగిరింతపదవి

  • అల్పకాలభోగ్యము.
  • ".......క్రూరకృత్యంబునకు నొడి గట్టినచో నొడి గట్టుటంబట్టి వాని పదవి చిగిరింతపదవి గాక మానదు." ధర్మజ. 32. 10. తె. జా.

చిగిరింతయైశ్వర్యము

  • అల్ప కాలభోగ్య మైన భాగ్యము.
  • "ఈ చిగిరింత యైశ్వర్యముకై యింత పొంగ నేల." ధర్మజ. తె. జా.