ఈ పుట అచ్చుదిద్దబడ్డది
గోవిం - గోస 661 గోస - గోళ్లు
- "వాడు గోవింద కొట్టా డట. నీకు తెలుసా?" వా.
గోవిందా అనిపించు
- ఇక చాలు రా అనిపించు.
- "గో,విందా యనిపించుకవులు వేవేలు సుమీ." గీర. గురు. 20.
గోవువెంట తగులు కోడెభంగి
- ఎప్పుడూ విడువక - వెన్నంటి అనుట.
- కాస్త విద్యావంతులు సంభాషించుకొనునప్పుడు ఉపయోగించే పలుకుబడి.
- ఇది భాఫవతంలోని ఒకా నొక పద్య భాగం.
- "వా డెప్పుడూ ఆ అమ్మాయి చెరుగు వదిలేట్టు లేడు. గోవువెంట దగులుకోడె భంగి అన్నట్లుగా ఉంది వీడి వ్యవహారం." వా.
గోసడచు
- నిందించు.
- "మనలన్ ధూర్జటితోడ గోసడఁచి కామధ్వంసి పట్టీక పొం,డని చక్రాం కునిఁ జూపి..." నిర్వ. 2. 93.
గోసన వుచ్చు
- చాటించు, ఘోషణ చేయించు, ఘోషించు.
- "గోసనంబులు వుచ్చి సర్వస్వదాను లగుచుండిరి." కుమా. 11. 59.
- "దాసియున్, గొఱగొఱ వీట నెల్లెడల గోసన పుచ్చిన." దశ. 10. 126.
- "తనదుర్వారతరప్రతాపమునఁ జిత్త స్నేహముల్ గట్టి సే,యు నితం డెట్టి విదగ్ధుఁడో దలఁప నోహో యంచు లోకంబు గో,సనపుచ్చన్." దశ. 1. 7.
- రూ. గోసన పుచ్చు.
గోస నాస ఉదయించు
- ఘోషణ బయలుదేరు. ఊరంతా గుప్పు మను.
- "శాఖోపశాఖల సాఁగుచున్నది రట్టు, గుఱి లేక యుదయించె గోస నాస." శివ. 3. 71.
గోళ్ల కుతికంటు
- ఒకనగ.
- "....గోళ్ల కుతికంటు నునిచె నొకతె." రాధి. 1. 93.
గోళ్లు గిల్లుకొను
- ఏ పని పాటా లేక ఉండు.
- "వాడు పొద్దస్తమానం గోళ్లు గిల్లుకుంటూ కూర్చుంటే ఆవిడ మాత్రం ఏం చేస్తుంది?" వా.
గోళ్లు మీటు
- గోళ్లు గిల్లుకొను. నిర్వ్యాపారిగా ఉండు.
- "పనుల కొడ ల్వంగక కా,మిను లిద్దఱుఁ గూడి గోళ్లు మీటుచు దాదుల్...." శుక. 2. 333.
- "వాడు పని లేక గోళ్లు గిల్లుకొంటూ కూర్చున్నాడు." వా.
గోళ్లు రాచు
- కలబడు, రాపాడు.
- "ఆ యెల ప్రాయమున్ భవదుదంచిత కీర్తియు గోళ్లు రాచఁగాఁ, గాయజుఁ డాకెపై నలిగి కత్తులు నూఱుచు..." కళా. 7. 35.