పుట:PadabhamdhaParijathamu.djvu/651

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గుడి - గుడి 625 గుడి - గుడి

గుడినుండి గుడిత్రాళ్లు గోయు

  • ఒకరి ఆశ్రయంలో ఉంటూ వారికే అపకారం తలపెట్టు.
  • "గుడినుండియె గుడిత్రాళ్లె,క్కుడుగాఁ గోయుట సగోత్రగుణములు సుమ్మీ." పాంచా. 4.
  • చూ. గుడినుండి గుడిరాళ్లు తీయు.

గుడి నుండి గుడిరాళ్లు తీయు

  • కృతఘ్ను డగు. ఉపకారికే ద్రోహము చేయు. తిన్న యింటి వాసాలు లెక్క పెట్టుటవంటి పలుకుబడి.
  • "గుడి నుండి గుడిరాళ్లు తీయుకరణి." పాండు. 3. 68.

గుడి, పాడు చిక్కు

  • సర్వశూన్య మగు, పా డయి పోవు.
  • "అంగళ్లయందు మిట్టాడ మానిసి లేక, గుడియుఁ భాడును జిక్కఁ జెడియె..." కాశీ. 5. 267.

గుడి మింగువానికి నంది పిండి వడియము

  • అంత పెద్దపనే చేసేవానికి మిగతపని ఒక లెక్కా అనుపట్ల ఉపయోగించే సామ్యము.
  • "అంతలేసి మహాత్ముల నింత సేయు, మాకు నిను సంహరించుట మాత్ర మెంత, యెందు గుడి మ్రింగువారికి నంది పిండి, వడియ మనుప ల్కెఱుం గవే పుడమిలోన." విక్ర. 2. 238.
  • చూ. గుడి మ్రింగువానికి తలుపు లప్పడములు.

గుడి మింగేవానికి లింగ మెంత?

  • చూ. గుడి మింగువానికి నంది పిండి వడియము.

గుడిముద్ర వైచికొను

  • దేవదాసిగా నుండు, బసివిగా నుండు.
  • వైష్ణవంలోనూ, శైవంలో కూడా కొందఱు ఆడపిల్లలను దేవునికి సమర్పించేవారు. వైష్ణవంలో దేవదాసీ లనీ, శైవంలో బసువులు లేక బసువురాండ్రు అనీ వీరికి పేరు. వీరు అలా బ్రహ్మ చారిణులుగా ఉండేవారు. కడకు వీరే వేశ్య లయినారు. ఏదో ఒక ఆలయానికి వీరిని సమర్పించేవారు గనుక ఆ గుడిముద్ర వీరిపై పడినట్లు. అట్లే దేవునికి వదలిన ఆబోతులను - అచ్చుపోసిన ఆబోతు లని అంటారు.
  • "జననము నందినం బురుషజన్మము కావలెఁ గాక యాఁడు దై,నను గుడిముద్ర వైచికొనినం దగు లేక కులాంగ నాస్థితిన్..." శుక. 2. 507.
  • చూ. గుడికి ముద్ర వేసుకొను.