పుట:PadabhamdhaParijathamu.djvu/611

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గంపె - గగ 585 గగ - గగ

గంపెడాశ

  • ఎక్కువ ఆశ.
  • "మా అల్లుడు పండగకు వస్తాడు గదా అని గంపెడాశతో ఉంటే సెలవు దొరక లేదని రాశాడు. మా అమ్మాయి మొహం ముడుచుకొని కూర్చుంది." వా.

గంపెడు పిల్లలు

  • ఎక్కువమంది సంతానం. పుట్టెడు దు:ఖం వంటిదే ఇది.
  • "గంపెడు పిల్లలతో ఈ మండిపోయే ధరల్లో ఎలా బ్రతకాలో తోచకుండా ఉంది." వా.

గగనంబు చించులీల

  • ప్రయాణ సంరంభాన్ని సూచిస్తూ వారి కోలాహలం, ఆకాశాన్ని కూడా తూట్లు పడ జేయుచున్నది అనగా అత్యధికముగా ఉన్నది అన్న అర్థంలో ప్రయుక్త మయ్యే పలుకుబడి. ఇలా యేర్పడిన మాటలు - మిన్ను ముట్టు, ఆకస మంటు, గగనము పగుల నార్చు, ఆకసము చీల్చు ఇత్యాదులు.
  • "తలవరు లింత నంత వెడదాఁటులతో గగనంబు చించులీ,లల విలసిల్లి వెంటఁ బదిలంబుగ రా..." శుక. 2. 220.

గగనకుసుమము

  • శూన్యము; అసంభవము.
  • "ఎన్నంగ నీదు సముఖము, క్రొన్నెల పొడ వయ్యె గగనకుసుమం బయ్యెన్." రాధా. 1. 7. పు.

గగనప్రసూనవాదము.

  • శూన్యవాదము.
  • "గగనప్రసూనవాదము, జగతిం బ్రత్యక్షమునకు సరి యనఁ దగునే?" కాళ. 3. 169.

గగన మగు

  • ఎంతో కష్ట మగు.
  • "వాణ్ణి పెండ్లికి ఒప్పించేసరికి గగనమయింది." వా.

గగనమా?

  • అరుదా ? అబ్బురమా ? అసాధ్యమా ?
  • "వాడి కా పుస్తకం రాయడం ఏం గగనమా?" వా.
  • "వానితో మాట్లాడ్డం ఏం గగనమా ? అన్నిసార్లు చెప్పుకొంటున్నాడు." వా.

గగనము చేసికొను

  • గొప్ప చేసుకొను.
  • "పసిగౌను పిడికిటఁ బట్టి చూచెద నన్నఁ, జెలి యది గగనంబు చేసి కొనెదు." సారం. 2. 224.
  • చూ. గగనమా?

గగనానికి యిలకు....

  • చాలా దూర మనుట.
  • 'గగనానికీ యిలకూ బహు దూరం బనినారు' అన్న త్యాగరాజు కీర్తన భాగంపై వచ్చిన పలుకుబడి.