పుట:PadabhamdhaParijathamu.djvu/584

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోతి - కోతి 560 కోతి - కోన్

కోతిచేతి అద్దము

  • చూ. కోతిచేతి కొబ్బరికాయ.

కోతిచేతి కొబ్బరికాయ

  • ఉపయోగించుకో లేనివానికి అమూల్యవస్తువు లభించినప్పుడు అనే మాట. కోతికి కొబ్బరికాయ దొరికితే దాన్ని పగలగొట్టి తినడం తెలియదు కదా !
  • "ఆ వెధవకు అంత మంచి పిల్ల దొరికి మాత్రం ఏం లాభం? కోతిచేతి కొబ్బరికాయ." వా.

కోతిచేతి పూలమాల

  • ఉపయోగం తెలియని వారికి చిక్కిన అమూల్యవస్తువు.
  • "కటకటా! మూర్ఖ మర్కటకరతలస్థ, కల్పతరు నూనమాలికా కల్పుఁ డగుచు." శుక. 1. 364.
  • చూ. కోతిచేతి కొబ్బరికాయ, కోతిచేతి అద్దము.

కోతిచేష్టలు

  • పిచ్చి చేష్టలు.
  • "ఏమిట్రా ! ఆ కోతిచేష్టలు. ఇంత పెద్దవాడ వైనా యింకా మట్టూ మర్యాదా తెలియక పోతే యెలా ?" వా.

కోతిని బ్రహ్మరాక్షసుని చేయు

  • అల్పులను అధికులుగా పొగడు.
  • "వీరధర్మ మిట్లు విడిచి విభీషణ, రాజు నెదుట దాశరథులఁ బొగడఁ, బాడి యగునె క్రోఁతి బ్రహ్మరాక్షసుఁ జేయ, వచ్చినాఁడ వెంతవారు వారు." భాస్క. యుద్ధ. 119.

కోతిపుండు బ్రహ్మరాక్షసి

  • చిన్న దానిని అనవసరంగా పెద్ద దగునట్లు చేయుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • పుండును కెలికి కెలికి కోతులు పెద్దవి చేసుకుంటా యని ప్రతీతి.
  • "ఆ చిన్న వాగ్వాదం కాస్తా కోతిపుండు బ్రహ్మరాక్ష సై హైకోర్టు దాకా వెళ్లింది." వా.

కోతిపుల్లలు

  • మగ్గం దారాలను మీదికి తగిలించే పుల్లలు. బ్రౌన్.

కోనకావలి

  • వ్యర్థము.
  • కోనకు కావలి కాయడం ఎందుకు అనుటపై వచ్చినది. శవజాగరణం లాంటిది.

కోనచీకటి

  • చిమ్మచీకటి.
  • "కోనచీఁకటిలోని కొనరఁ జొచ్చి." కళా. 4. 121.

కోన్ కిస్కా

  • వీఁ డెవడు ? య: కశ్చన.
  • "క్రుద్ధుం డగు భీష్ముముందు కోంకిస్క గజశ్రద్ధుండు కర్ణుఁ డే మగు." గీర. గురు. 45.
  • చూ. కశ్శనగాళ్ళు.