పుట:PadabhamdhaParijathamu.djvu/583

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోణా - కోతి 559 కోతి - కోతి

కోణాలగొంది

  • ఒక మూల.
  • "మఠాంతరాళ విశాల వేదులయందుఁ గోణాలగొందిఁ దపంబు సల్పు జనంబు." పాండు. 5. 296.

కోత కోయు

  • చీట్లాటలో మిగతవారు వేసిన రంగుముక్క లేనప్పుడు తన దగ్గర ఉన్న తురుపుముక్క వేస్తే అది కోత కోయడం అవుతుంది. ఆ పట్టు వానికే పోతుంది.
  • చూ. పైకోత కోయు.

కోతలరాయడు

  • డంబాచారి. మాటా. 65.

కోతలు కోయు

  • డంబాచారములు పలుకు. గొప్పలు చెప్పుకొను. సాక్షి. 13 పు.

కోతికి కొబ్బరికాయ అబ్బినట్లు

  • ఎంత అమూల్య మైనా ఉపయోగించుకునే యోగ్యత లేనప్పుడు దొరికీ ఏం లాభం? - అనుపట్ల ఉపయోగిస్తారు.
  • "ఆ ఆడంగుల వెధవకు అంత అందమైన పిల్ల నిచ్చి చేశారు. కోతికి కొబ్బరికాయ అబ్బినట్లుగా ఉంది వాడి పని." వా.
  • చూ. కోతిచేతి కొబ్బరికాయ.

కోతికి కొబ్బరికాయ చిక్కినట్లు

  • అనుపభోగ్య మనుట. కోతికి కొబ్బరికాయ దొరికినా అది అనుభవించ లేదు కదా ! అది యెట్లా పగలకొట్టి తినాలో దాని కేం తెలుసు?
  • చూ. కోతికి కొబ్బరికాయ అబ్బినట్లు.

కోతికి స్త్రీ వేషము

  • అతకనిది. కోతి వికార మైనది. దాని కెంత స్త్రీ వేషం వేసినా కుదరదు అనుట. గువ్వలచెన్న. 75.

కోతికుళ్లాయి

  • చలి తగలకుండా వేసుకొనే ఉన్ని తలటోపీ.

కోతికొమ్మచ్చు లాడు

  • పెద్ద వారితో పరియాచక మాడు; ఒక ఆట ఆడు. కోతి కొమ్మచ్చు లనేది ఒక విధ మైన పిల్ల లాడుకొనే ఆట. చెట్ల మీదనే దొంగకు అందకుండా తప్పించుకొంటూ చెట్టు మొదలు పట్టుకోవాలి. వేసవికాలంలో నేటికీ యీ ఆట పల్లెలలో పిల్ల లాడుతూ ఉంటారు.
  • "నీ అంత స్తెక్కడ? నా అంతస్తెక్కడ? నాతో కోతికొమ్మచ్చు లాడుతున్నా వేమిటిరా?" వా.