పుట:PadabhamdhaParijathamu.djvu/557

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొంప - కొంప 533 కొంప - కొంప

కొంపచెఱుపు

  • ధూర్తుడు, దుష్టుడు.
  • "కొంటె కసుమాలమును దూబ కొంప చెఱుపు." హంస. 5. 113.

కొంప తీయు

  • పాడు చేయు.
  • "ఆవిధి యేమి సేయును మహా ముని ముఖ్యుల మంచుఁ గొంద ఱీ, జీవుల కొంప దీయఁ గడుఁ జిక్కుగ వ్రాసిరి..." కవిమాయ. 4. 73.
  • "తియ్యగా మాటలు చెప్పి నమ్మించి ఆ పిల్ల కొంప తీశా డా వెధవ." వా.
  • చూ. కొంపలు తీయు.

కొంప దీసి.....!

  • ఒక వేళ అలాంటి అనాహూతం జరగ లేదు కదా ! అనుపట్ల ఉపస్కారకపదంగా వినవచ్చే పలుకుబడి.
  • "మనం అన్న మాటలు కొంపదీసి వాడు వినలేదు కదా!" వా.

కొంప నట్టేటిలో గట్టు

  • కూడనిపని చేయు. వ్యసన. నాట. 4.

కొంపమీద పడి తిను

  • ఒకరి యింట చేరి వారి తిండితో బతుకు. అలా తినుటకు అధికారం లేనివారి యెడనే ఉపయోగిస్తారు.
  • "వాళ్లంతా ఆ పిల్ల కొంపమీద పడి తింటున్నారు. ఇంక అ దేం ముందు కొస్తుంది ?" వా.

కొంప ముంచు

  • సర్వనాశనం చేయు.
  • "అన్న కదా అని ఆవిడ ఆస్తి అంతా తీసుక వస్తే, వీడు ఆవిడ కొంప ముంచాడు." వా.
  • చూ. కొంప తీయు.

కొంప మునిగిపోవు

  • అనిష్టము సంప్రాప్త మగు.
  • "ఇం కేముంది? కొంప మునిగి పోయింది. మనవాడు వెళ్లి వాళ్లపక్షాన సాక్ష్యమిస్తా నన్నాట్ట." వా.

కొంప మునుగు

  • అనిష్టము సంప్రాప్తించు.
  • "ఏదో కొంప మునిగినట్లు అర్ధరాత్రి పరుగెత్తు కొచ్చాడు. చేబదులు కావాలట చేబదులు!" వా.

కొంపమ్ముకొను

  • ఉన్న ఆస్తి పాస్తులను పాడు చేసుకొను.
  • "సుందరిని గూడి కొంపమ్ముకొనఁగ లేదొ." శ్రవ. 2. 60.
  • వాడుకలో రూపం: 'కొంపమ్ముకొని పోయాడు' అన్నట్లు ఆత్మ నేపదంగానే ఈ క్రియ వినవస్తుంది.

కొంప లంటుకొను

  • అనాహూతము దాపురించు. విపరీత మైన నష్టమో, ఆపదో వచ్చిన దని చెప్పే పట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "నీవు ఏమో ఒకమాట అని వచ్చావు. అక్కడ కొంపలు అంటుకొన్నాయి." వా.