పుట:PadabhamdhaParijathamu.djvu/481

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలి____కాలి 455 కాలి____కాలి

  • "నలుగురూ చేరేసరికి ఆ దొంగ కాలికి బుద్ధి చెప్పాడు." వా.

కాలికి ముల్లు గ్రుచ్చుకొనదు

  • ఏమాత్రం అపాయం కలగదు.
  • "కాలు ములు గాడునే సదా మేలె గాక, వెఱపు వలదు." ప్రబోధ. 4. 56.

కాలికి వేస్తే మెడకు, మెడకు వేస్తే కాలికి వేయు

  • ఏదో విధంగా వాదంలో తికమకలు పెట్టు.
  • "వానితో మనం వాదించ లేం. కాలికి వేస్తే మెడకూ, మెడకు వేస్తే కాలికీ వేస్తూ కూర్చుంటాడు. ఏదీ తెగ నివ్వడు; ఎందుకూ అంగీకరించడు." వా.

కాలికి వేస్తే మెడకు వేయు

  • ఒకదానికి సమాధాన మివ్వగా మరొక తగాదా లేవదీయు.
  • "వాడితో సమాధానపడడం సాధ్యం కాదు. కాలికి వేస్తే మెడకు వేస్తుంటాడు." వా.

కాలికి వేస్తే వేలికి, వేలికి వేస్తే కాలికి

  • చూ. కాలికి వేస్తే మెడకు మెడకు వేస్తే కాలికి.

కాలిక్రింది కసవుగా చూచు

  • హీనముగా చూచు. ఇక్కడ కసవు గడ్డి అనే అర్థంలో ప్రయుక్త మైనది.
  • "పరభయంకరబిరుదవిస్ఫురితు డైన, కాంతు నయ్యిందుముఖి తన కాలిక్రింది, కసవుగా నెంచు వెడమాయ గప్పి చోర,ధవుల మాటలు వడకి యౌదల ధరించు." శుక. 3. 128.
  • పొరక, పూచిక, గడ్డిపుల్లలను హీనతాసూచకములుగా ఉపయోగించిన పలుకుబడులు మనకు చాలా ఉన్నవి.
  • "వాడు నన్ను పొరకపుల్లకంటే హీనంగా చూస్తాడు." వా.
  • "ఆ పని వాడికి పూచికపుల్లతో సమానం." వా.
  • "వాడు నాకు గడ్డిపరకతో సమానం." వా.

కాలికొద్దీ పరుగెత్తు

  • ఎంత శక్తి ఉన్నదో అంత శక్తినీ ఉపయోగించి పరుగెత్తు.
  • "నలుగురూ చుట్టుకొనేసరికి ఆ దొంగ కాలికొద్దీ పరుగెత్తాడు." వా.

కాలికొద్దీ పరువెత్తు

  • వేగముగా పరుగెత్తు.
  • "కుక్క తరుముకు వచ్చేటప్పటికి వాడు కాలికొద్దీ పరు వెత్తాడు." వా.

కాలికొలది

  • కాలిదాకా.
  • "కొదమతట్టువగుంపు కాలికొలందికి వ్రేలు లాలు కుంచెలు." ఆము. 4. 35.

కాలి గోటికి దీటు రాదు

  • ఏమాత్రం సరిపోలదు.
  • "రంభ కూడా దాని కాలిగోటికి దీటు రా దంటే ఇక ఊహించుకో! ఎంత అంద మైన పిల్లో." వా.