పుట:PadabhamdhaParijathamu.djvu/477

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కార్య____కాఱి 451 కాఱి____కాఱొ

కార్యము చేయు

 • నిషేకము చేయు.
 • "మా అమ్మాయికి కార్యం చేయాలి ఈ నెలలో?" వా.

కార్యము తప్పు

 • కార్యము చెడు.
 • "ఇక నిట్టటు, దడసిన గార్యము దప్పు ననుచు." కళా. 6. 71.
 • "అప్పుడు మంత్రులు కార్యము దప్పె గదా యనుచు." నిరంకు. 4. 68.

కార్యము తెగు

 • పని ముగియు.
 • "తెగు గార్య మనువార్త." విజయ. 1. 41.

కార్యము పాకము తప్పు

 • పని చెడిపోవు.
 • "మతి దలపోసి యీపలుకు మానుడు పాకము దప్పె గార్యముల్..." భార. భీష్మ. 1. 13.
 • చూ. పని పాకము తప్పు.

కార్యవాది

 • అనవసరంగా వాదాలతో పని చెఱచుకొనక పని అయ్యేటట్టు చూచుకొనేవాడు.
 • "లేనిపోనివానికి వెళ్లేవాడుకా దతను. కార్యవాది." వా.

కాఱియపెట్టు

 • బాధపెట్టు.
 • "దుర్భాషా, ఘనశరములు మనము నాటి కాఱియ బెట్టన్." భాగ. స్క. 4. 221.

కాఱియవడు

 • కష్టపడు; బాధపడు.
 • "జూదమాడి ధర్మనూనుండు రాజ్యంబ, ననుజులను బ్రియాంగనను బణంబు, గాగ నొడ్డి యాడి కాఱియవడ డె."భార. విరా. 5. 245.

కాఱియ వెట్టు

 • కష్టపెట్టు.
 • "మా ఱెందు లేక నిరతము, గాఱియ వెట్టంగ బెగడి." రుక్మాం. 3. 4.

కాఱుకూతలు

 • దుర్భాషలు.
 • "కన్ను లెఱ్ఱచేసి యన్నుల గని కాఱు, కూత లఱచె దేల కోకిలంబ!" రసిక. 4. 170.

కాఱు లఱచు

 • 1. దుర్భాష లాడు.
 • "కతలు సెప్పెదు విను మంచు గాఱు లఱచు, నేర్పు గలుగుట." రుక్మాం. 5. 86.
 • 2. కాఱుకూతలు కూయు.
 • "కంటే బ్రాహ్మణు డెన్ని కాఱు లఱచెన్ గర్వించి వీ రెల్ల నా,కంటెన్ బాత్రులె." మను. 5. 14.

కాఱులాడు

 • వ్యర్థప్రలాపాలు పల్కు.
 • "ఇవము నూడుకొలపుటేలికల్ ము న్నెందు, గాఱు లాడి రనినకత యెఱుంగ." అచ్చ. అయో. 30.

కాఱులు చెప్పు

 • కారుకూతలు కూయు.
 • "ఏమి కాఱులు చెప్పె దీమఱ్ఱి నాకు?" ద్విప. జగ. 158.

కాఱొడ్డెకాడు

 • దుర్భాషి. శేష. 3. 269.