పుట:PadabhamdhaParijathamu.djvu/422

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కన్ను____కన్ను 396 కన్ను____కన్ను

కన్నుల పండువు(గా)

  • నేత్రపర్వము. మనోజ్ఞము. మనోహరము.
  • "సుందరాకృతులు గన్నులపండువు." 7. 123.
  • "ఆ అమ్మాయి నడుస్తుంటే కన్నుల పండువుగా ఉంటుంది." వా.

కన్నుల బడు

  • కానవచ్చు. కువ. 3. 59.

కన్నుల ముంచి క్రోలు

  • ఆసక్తితో చూచు.
  • "నీ వన్నెల్ కన్నుల ముంచి క్రోలుటలు." నారా. శత. 46.
  • వాడుకలోనూ: "కళ్ళతో త్రాగి వేస్తున్నా డా అమ్మాయిని" వంటి రూపాలలో ఇది వినవస్తుంది.

కన్నుల ముత్యాలు గారు

  • ఏడ్చు.
  • "ఎన్నడు నెండక న్నెఱుగనిశిశువు కన్నుల ముత్యాలు గాఱ నేడ్చెడిని." హరిశ్చ. 2. 924.
  • చూ. కన్నుల నీలాలు గారు.

కన్నుల ముసు గిడు

  • కన్నులు గప్పు.
  • "కన్నుల ముసుగిడ్డ కంతుని మాయాం ధతమసపటము..." రాధా. 2. 199.

కన్నులమ్రాను

  • చెఱకు.

కన్నులలో నిప్పులు పోసికొను

  • ఓర్వలేక పోవు.
  • "మనము నేర్చుచున్న విద్యను గాంచి తాను గన్నులలో నిప్పులు పోసికొను చున్నాడు." సాక్షి. 47. పు.

కన్నుల సన్న నునుచు

  • ఆజ్ఞానువర్తులనుగా చేయు. కనుసన్న మెలగున ట్లొనర్చు.
  • "దిగధీశ్వరుల నోలి, మన్నించి కన్నుల సన్న నునిచె." కుమా. 7. 155.

కన్ను లాకలి తీర్చు

  • కన్నులు తనియించు; కండ్లారా చూడ నిచ్చు.
  • "ఎన్నడు వచ్చునో యిందిరావిభుడు, కన్ను లా కలి తీర్ప గలుగునో యనుచు." ద్విప. మధు. పు. 38.

కన్ను లార

  • కనులకు సంతృప్తిగా, బాగా, ప్రత్యక్షంగా.
  • "కన్నులారా జూచుచును." పండితా. ప్రథ. దీక్షా. పుట. 155.
  • "కన్నులారా అందరు చూస్తుండగా దొంగ పారిపోయాడు." వా.

కన్ను లార్చు

  • వంచించు.
  • "...వనితకు గన్ను లార్ప నిటు వచ్చిన వాడవె..." రుక్మాం. 5. 22.

కన్నులు కట్టు

  • మోసగించు; కన్నుకొట్టు.
  • "నన్ను నమ్మించి తెచ్చి, కాననంబు లో గన్నులు కట్టి కాడు, పఱచి నీ కిట్లు పోజన్నె భావజన్మ!" కుమా. 5. 65.
  • చూ. కన్నులు గట్టు.

కన్నులు కానని

  • అంధురాలయిన. చూపు లేని.