పుట:PadabhamdhaParijathamu.djvu/401

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


కథ____కథ 375 కథ____కద

కథ తెలిసి వచ్చు

 • బండారము బయట పడు.
 • "ఏమీ తెలియని రైతులను ఏడిపించుకొని తినినట్టు కాదు. కరణమయ్యతో కంటు కట్టుకుంటే నీ కథ తెలిసొస్తుంది." వా.
 • "వాని కథ ఈనాటిక్కానీ నీకు తెలిసి రాలేదు. నే నెప్పు డనగా చెప్పాను. వాడు వట్టి దగుల్బాజీ అని?" వా.

కథల కామరాజు

 • కథల పుట్ట.
 • "వాణ్ణి పలకరిస్తే ఒక కథ చెప్తాడు. ఆ కథలకామరాజుతో పెట్టుకుంటే మన మీనాడు కొంప చేరుకున్నట్టే!" వా.

కథలు పన్ను

 • కల్పించు, ఏవో కల్పనలు చేసి మోసగించు.
 • "కఱకంఠ! యిది యేల కథలు వన్నెదవు." బసవ. 4. 104.
 • రూ. కథలుపన్ను.

కథలు, నీతులు, కారణాలు

 • కథలూ అవీ. జం.
 • "కథలును నీతులు గారణంబులును." పండితా. ప్రథ. దీక్షా. పుట. 152.
 • వాడుకలో రూపం:
 • కథలూ కారణాలూ.

కథలూ కారణాలూ

 • కథలూ అవీ. జం.
 • "ఏదో మధ్యాహ్నం పూట కథలూ కారణాలూ చెప్తూ ఉంటుంది మా బామ్మ." వా.
 • చూ. కథలూ కారుణ్యాలూ.

కథలూ కారుణ్యాలూ

 • కథలూ అవీ. జం.
 • చూ. కథలూ కారణాలూ.

కథా కమామీషూ

 • పుట్టు పూర్వోత్తరాలు. జం.
 • "దాని కథా కమామీషూ చెబుతాను విను." వా.

కథానాయకుడు

 • ముఖ్యుడు.
 • "ఈ వ్యాజ్యంలో కథానాయకుడు మీ మామే." వా.

కథాశేషు డగు

 • చనిపోవు.
 • చూ. కీర్తి శేషు డగు.

కదలారతి పళ్లెరము

 • వధూ వ రాదులు గృహ ప్రవేశం చేసేటప్పుడు హారతి యిచ్చు పళ్లెము.
 • "జాళువా కదలారతి పళ్లెరంబు సొంపున." చంద్రి. 4. 68.

కదలించి చూచు

 • సూచనగా అభిప్రాయం తెలుసుకొను.
 • "పోనీ. మీ మామ ఏమంటాడో కాస్త కదలించు చూడు. తర్వాత సంగతి చూతాం." వా.
 • చూ. కదిలించి చూచు.

కదలించు

 • అనవసరముగా రెచ్చగొట్టు.
 • "కదలింపకుము నన్ను గన్న మాయయ్య." పల. పుట. 48.
 • "న న్ననవసరంగా కదలించకు. తర్వాత విచారిస్తావు." వా.