పుట:PadabhamdhaParijathamu.djvu/270

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎంత____ఎంత 244 ఎంత____ఎంత

ఎంతకు దిగితిని అనే నేటి వాడుక. రాయలసీమలో ఎంతకు వగదెగితివి అని ఇదేచోట అంటారు. ఎంతకు నేరరు ?

  • ఎంత కైనా సిద్ధపడతారు అని తాత్పర్యం.
  • "ఎంతకు నేర రంత తెగియించినవా రది యున్నదే కదా." శుక. 4. 28.
  • వీడు ఎంత కైనా తగును, ఎంత కైనా మనిషి మొదలయినవాట్లో ఈ పలుకుబడి వినవస్తుంది.

ఎంతకు లేడు ?

  • ఎంతపనికి సిద్ధపడడు? ఎంత పని కై నను సిద్ధపడు ననుట.
  • "ఎంతకు లేడు నారదమునీంద్రుడు శౌరి వినంగ నేను వినగా." పారి. 1. 80

ఎంత కెంత

  • ఎక్కడి కెక్కడ ?
  • "ఏమి చెప్పవలయు నెంత కెంత ?" వీర. 2. 81.

ఎంత కైనా మనిషి

  • ఎంత దుష్కార్యం చేయనైనా సమర్థత గలమనిషి.
  • "వా డెంత కైనా సమర్థుడు. పొగడ గలడు, తెగడగలడు. వాణ్ణెవడు నమ్ముతాడు?" వా.

ఎంత కైనా తగును

  • ఏ చెడుగు కైనా సిద్ధపడును.
  • "నిన్న తప్పక సాయపడతా నని ఈ రోజు తానే వ్యతిరేకంగా పని చేస్తున్నాడు. అత నెంత కైనా తగును." వా.

ఎంత గింజుకున్నా

  • చూ ఎంత తన్నుకున్నా.

ఎంత చెప్పితే అంత

  • ఆ మాటకు తిరుగు లే దనుట.
  • "ఆ పెళ్లాం ఎంత చెప్పితే అంత. ఆడికి ఏమాత్రం విచక్షణ లేదు." వా.

ఎంతటిదవ్వు ?

  • చాలా దూరము, మాకూ వానికీ చాలా దూరము - అనుట వంటిది.
  • "ఈ పరిపాటి సేవ రచియించుటకే తగినట్టివార మో, భూపవరేణ్య! యేము పెఱపోడుము లెంతటి దవ్వు మా కికిన్." కళా. 7. 229.

ఎంత తన్నుకున్నా

  • ఎంత అవస్థ పడినా, ఏం చేసినా అనే సందర్భంలో ఉపయోగిస్తారు.
  • "ను వ్వెంత గింజుకున్నా ఎంత తన్నుకున్నా వాడిదగ్గర దమ్మిడీ రాలదు." వా.
  • "ఎంత తన్నుకున్నా వాని కా పద్యంలో ఒక్క పాదం అర్థం కాదు." వా.

ఎంత తల బద్దలు కొట్టుకొన్నా

  • ఎంత విడమరచి చెప్పినా. కొత్త. 78.