పుట:PadabhamdhaParijathamu.djvu/259

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఊపి____ఊర 233 ఊర____ఊర

ఊపిరి తిప్పుకొన లేక పోవు

 • ఉక్కిరి బిక్కిరి అగు.
 • "ఈ పనితో ఊపిరి తిప్పుకొన లేక పోతున్నాను." వా.
 • చూ. ఊపిరి ఆడకుండు.

ఊపిరి బిగబట్టు

 • కాస్త ఓపిక పట్టు.
 • "ఈ ఒక్కరోజూ కాస్త ఊపిరి బిగపట్టి ఉండు వదినా! రేపు మేము వెళ్లిపోతాం. అప్పుడు నీయిష్టం వచ్చినట్టు నీపిల్లలను కొట్టుకొందువుగానిలే." వా.

ఊపిరి మోచు

 • బ్రతుకు.
 • "ఊపిరి మోచిననాడే బట్టికొంటివాస లెల్ల." తాళ్ల. సం. 8. 83

ఊపిరి సలపడం లేదు

 • పని యెక్కు వైన దనుట.
 • చూ. ఊపిరాడడం లేదు.

ఊరక పడి యుండు

 • మరొక ఆలోచన లేకుండా ఉండిపోవు.
 • "ఎవ్వారి దాన నిచట నూరక పడియుండ." కళా. 4. 110.
 • "ఏదో ఇంత తిని ఊరికే పడి ఉండరా?" వా.
 • "నా కెందుకు? వాళ్లేమైనా చేసుకొనీ. నేను ఎక్కడో ఒకచోట ఊరికే పడి ఉంటాను." వా.

ఊరక పోదు

 • వ్యర్థము కాదు.
 • "నాకును బ్రియం బగు టొక్కటి యెక్కు డాప్రియం, బూరక పోదు..." కళా. 5. 195.
 • "నా వంటివానికి చెరుపు చేస్తే ఊరికే పోదు." వా.

ఊరగుంత

 • రొచ్చుగుంట వంటిది. తాళ్ల. సం. 12. 151.

ఊరంత బలగము

 • ఎక్కువ బలగము.
 • "ఊరంతబలగంబు." విజయ. 3. 133.
 • "వారి కేమమ్మా, ఊరంత బలగ ముంది. ఏ పని పట్టుకున్నా గబగబా ముగించగలరు." వా.

ఊరంతా ఉడుకు

 • గగ్గో లగు.
 • "ఓషధిప్రస్థ ముల్లల నుడుకుచుండ." హర. 5. 10.
 • "పక్క ఊళ్లో దొంగలు పడ్డారని తెలిసి ఈ ఊరంతా ఉడికిపోతూ ఉంది." వా.
 • "వా డాపిల్లను లేవదీసుకు పోయా డని ఊరంతా ఉడికి పోతూ ఉంది." వా.

ఊరంతా గుప్పు మను

 • పొక్కు; ఊరందరికీ తెలియు. కొత్త. 434.

ఊరకుక్క

 • పనికి మాలినది.
 • "నూరు ఊరకుక్క లైనా ఒక వేట కుక్కతో సరి పోవు." వా.

ఊరజోగి

 • ఊరూరు తిరిగి భిక్ష మెత్తుకొనువాడు.
 • "ఊరగకంకణుతోడ నూరజోగులను, సరి చేసి యెన్నినచందాన నీవు." గౌ. హరి. ప్రథ. పంక్తి. 175-176.