పుట:PadabhamdhaParijathamu.djvu/251

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉల్లి____ఉవ్వె 225 ఉవ్వి____ఉవ్వి

ఉల్లి పాషాణము

  • ఒకరక మైన విషము.

ఉల్లిపొరవంటి

  • మిక్కిలి పల్చ నైన.
  • "వా డెప్పుడూ ఉల్లిపొరలాంటి మల్లు పంచలు కడతాడు." వా.

ఉల్టా సీదా

  • పైన ఒకటి, లోపల ఒకటి అనుట. ఇది గుడ్డనేతద్వారా వచ్చిన పలుకుబడి. నేతలో పైన నున్నగా లోపల గరుకుగా ఉండునట్లు నేసేనేత ప్రసిద్ధము.
  • "ఈ పని అంతా ఉల్టాసీదాగా ఉంది." వా.
  • చూ. ఉల్టాసీదామనిషి.

ఉల్టాసీదా మనిషి

  • వంచకుడు.
  • "వాడు వట్టి ఉల్టాసీదామనిషి. అన్నదంతా నిజ మనుకోకు." వా.
  • చూ. ఉల్టాసీదా.

ఉవ్వలపోటి

  • బాలక్రీడావిశేషము.

ఉవ్వెత్తుగ

  • 1. పూర్తిగా, సులువుగా.
  • "నను నువ్వెత్తుగ బాఱ మీటితివి." వసు. 2.
  • "ఆవ యువ్వెత్తుగ ద్రావినట్లు." పాండు. 5.
  • "బలౌఘములన్ నుఱుమాడి వైచె నువ్వెత్తుగ." కళా. 8. 57.
  • హఠాత్తుగా, ఒక్కుమ్మడిగా.
  • "ఉవ్వెత్తుగ జుట్టుముట్టుకొని యీటెల డొంకెనలన్..." కళా. 8. 58.
  • "కాని యువ్వెత్తుగా వీడగా దరంబె." దేవీ. 1. 487.

ఉవ్విళులూరు

  • ఉవ్విళ్లూరు. ఎందుకోసమో అత్యుత్సుకతతో నుండు.
  • "ఉవ్విళు లూరెడునెమ్మనంబులు." విరాట. 5. 393.

ఉవ్విళులూర్చు

  • ఉవ్విళు లూరునట్లు చేయు.

ఉవ్విళ్ళుగొను

  • ఉవ్విళ్లూరు.
  • "కలహాశనమౌని చూడ్కు లువ్విళ్ళు గొనంగ జొచ్చె." కవిక. 2. 150.

ఉవ్విళ్ళు గొలుపు

  • ఉవ్విళు లూరునట్లు చేయు. ప్రభా. 3. 66.

ఉవ్విళ్ళూరు

  • మిక్కిలి ఆశపడు.
  • "విను నీ రూపము సూచి మా నృపతి యువ్విళ్లూరు నే నెమ్మెయిన్, బని గొందున్." భార. విరా. 1. 321.
  • "అత డువ్విళ్ళూరెడు." హరి. ఉత్త. 6. 116.
  • "అత డువ్విళ్లూరెడు బలవన్మదోద్ధతి యడపన్." హరి. ఉ. 6. 116. పాండు. 5. 22.
  • "వాడు పెళ్లి చేసుకోవా లని మహా ఉవ్విళ్లూరుతున్నాడు." వా.