పుట:PadabhamdhaParijathamu.djvu/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇద____ఇది 156 ఇది____ఇది

ఇదమిత్థము

  • 1. ఇది ఇట్లా అని.
  • "ఇదమిత్థ మ్మని యేనును మది మితి సేయంగ నేఅ..." పాండు.. 3. 125.
  • 2. సారాంశము.
  • "అతను గంటలకొద్దీ ఏవేవో చెప్తాడు. ఇదమిత్థం తేల్చి చెప్పడు." వా.

ఇదానీంతనము

  • ఆధునికము.

ఇది గాక

  • మరిన్నీ.
  • ఏదైనా చెప్తూ మరొక ఉపపత్తిని తెలిపేటప్పుడు ఉపయోగించేపలుకుబడి.
  • ఈ 'ది' 'దీ' అని దీర్ఘంతో కూడా వినిపిస్తుంది.
  • "ఇది గాక మఱొక మెలిక కూడా ఇందులో ఉంది." వా.
  • చూ. ఇదీ గాక.

ఇదిగో అంటే ఇన్నూ రేండ్లు

  • ఇప్పుడే చేస్తా నంటూ కాలం గడిపేవాని విషయంలో ఉపయోగించేపలుకుబడి.
  • "వాణ్ణి నమ్ముకుంటే ఇక నాపని అయినట్లే. వాడు ఇదుగో అంటే ఇన్నూ రేండ్లు." వా.
  • రూ. ఇదుగో అంటే ఇన్నూ రేళ్లు.

ఇదిగో అదిగో అని చూచు

  • ఇదో వస్తుంది అదో వస్తుంది అని వృథాగా ఎదురు చూచు.
  • "మా, కోసము తల్లిదండ్రు లిదిగో నదిగో నని చూచు టాయె." నానా. 47.

ఇది తడవ బని లేదు

  • దీన్నిగూర్చి ఆలోచించవలసిన అవసరం లేదు.
  • "దీని కెంత వలసిన నేమి యిది దడవం బని లేదు." కళా. 3. 66.

ఇది పోలు నిది పోల దని

  • ఇది మంచీ, ఇది చెడ్డా అని.
  • "ఇది పోలు నిది పోల దని చెప్ప దెలియునే, యసదు బొడువ." పాండు. 5. 229.

ఇది యది యనక

  • అడ్డు చెప్పక.
  • "ఇది యది యన కూరకునికి యెంతయు నొప్పున్." భార. ఉద్యో. 2. 59.
  • "వాడిపాటికి వా డేదో చెప్పుకొంటూ ఉంటాడు. ఇదీ అదీ అనకుండా వింటే సరి. మన కెందుకు వచ్చినగొడవ." వా.
  • రూ. ఇదీ అదీ అనకుండా.

ఇదియే పదివేలు

  • ఇంతే చాలు.
  • జరిగిన యేస్వల్ప మైనపనినో మహత్కార్యంగా భావించుటలో ఉపయోగించుపలుకుబడి.
  • "ఇదియె పదివేలు వైభవం బెల్ల నాడు, నల్ల పూసలు చెవియాకు నాకు జాలు." శుక. 2. 84.
  • "నువ్వు తిరిగి వచ్చావు. అదే నాకు పది వేలు, డబ్బు పోతే పోయింది." వా.
  • రూ. అదియే పది వేలు.