పుట:PadabhamdhaParijathamu.djvu/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇచ్చ_____ఇచ్చ 151 ఇచ్చ_____ఇచ్చి

ఇచ్చక బుచ్చకములు

  • అచ్చిక బుచ్చికలు. జం.
  • నలచ. 6. 162.

ఇచ్చక మాడు

  • ముఖప్రీతి మాటలాడు, ముఖ స్తుతు చేయు.

ఇచ్చకలమారి

  • ముఖస్తుతి చేయువాడు.
  • "వాడు వట్టి ఇచ్చకాలమారి. వాడి మాటలు నమ్మవద్దు." వా.

ఇచ్చకులు

  • ఇచ్చకాలు మాట్లాడువారు.
  • "అప్పు డిచ్చకు లగుకుబ్రాహ్మణులు గొందఱు." ఆము. 4. 46.

ఇచ్చకు వచ్చినట్లు మాట్లాడు

  • ఇష్టము వచ్చినట్లు మాటలాడు అనగా నిందించు, తూలనాడు.
  • "ఇత్తఱి రేగి రేగి తన యిచ్చకు వచ్చిన వెల్ల నాడెడిన్." కా. మా. 3. 44.

ఇచ్చగించు

  • ఇష్టపడు, కోరు.

ఇచ్చగొను

  • కోరు.

ఇచ్చగోరు

  • కోరు, ఇష్టపడు.
  • "కేవల తా సుఖ మిచ్చ గోరుచున్." భీమ. 4. 7.

ఇచ్చమానికము

  • చింతామణి.
  • "ఇచ్చమానిక మేయూరిరచ్చఱాయి." చంద్ర. 2.66.

ఇచ్చ మెచ్చు

  • 1. ప్రియపడు, మెచ్చుకొను.
  • "ఆత్మ చిత్తముం దోచిన చందముం దెలియ దోచిన నచ్చర లిచ్చ మెచ్చరే." ఉ. హరి. 1. 163.
  • 2. సంతోషించు.
  • "సకలసైన్య మిరుగడల గొల్వ దన పురీవరము జేరె, నేలికయు దల్లిదండ్రులు నిచ్చ మెచ్చ." శుక. 1. 429.

ఇచ్చసలుపు

  • కోర్కె తీర్చు.
  • "నా యిచ్చ సలుపు మోజియ్య." పండితా. ద్వితీ. పర్వ. పుట. 477.

ఇచ్చికబుచ్చిక సేయు

  • విజయ. 3. 30.
  • చూ. అచ్చికబుచ్చిక సేయు.

ఇచ్చిపుచ్చుకొను

  • 1. పరస్పరం వియ్య మందు.
  • "మాకూ వాళ్లకూ యిచ్చిపుచ్చుకోవడాలు తరతరాలుగా వస్తున్నవి." వా.
  • 2. పరస్పరం సహాయము చేసుకొను.
  • "ఇరుగూపొరుగూ వా ళ్లన్నతర్వాత యిచ్చి పుచ్చు కోవడా లంటూ ఉంటేనే." వా.
  • "వాళ్లకూ మాకూ ఇచ్చిపుచ్చుకొనడాలు ఉన్నాయి." వా.
  • 3. లావాదేవీలు.
  • "ఆ షాహుకారు దగ్గర యిచ్చి పుచ్చుకోవడం మా నాన్నకాలంనుంచీ అలవాటు." వా.

ఇచ్చిపుచ్చుకోలు

  • చూ. ఇచ్చిపుచ్చుకొను.