పుట:PadabhamdhaParijathamu.djvu/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంటా_____ఇంటి 137 ఇంటి_____ఇంటి

ఇంటాతడు

  • మగడు.
  • "మా యింటాత డెపు డైన గలసిన నాతని గా దలంతు." అహల్యా. 3. 58.
  • చూ. ఇంటియాతడు; ఇంటాయన.

ఇంటాయన

  • మగడు.
  • "మా యింటాయన ఊళ్లో లేరు." వా.
  • చూ. ఇంటాతడు.

ఇంటావిడ

  • ఇల్లాలు.
  • ఇది కోస్తాప్రాంతంలో వినిపించేమాట.
  • "మా యింటావిడకు కాస్త సుస్తీ చేసింది." వా.

ఇంటా వంటా లేదు

  • ఈ వంశంలో యిలాంటి అలవాటు లేదు, ఇలాటి దుర్గుణాలు వీరికి బొత్తిగా లేవు అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "సైచు టెట్టు లిక నింటన్ వంట లే విప్పనుల్." పాణి. 5. 3.
  • "ఇలాంటి వెధవపనులు మా యింటా వంటా లేవు. వీడు మాయింట్లో చెడబుట్టాడు." వా.
  • రూ. ఇంట నెన్నడు లేని.

ఇంటికంటే గుడి భద్రము

  • సొంతం దానికన్నా తిరెపెంగా వచ్చినదే హాయి-అని సూచించేపలుకుబడి.
  • "వానికి అత్తారిల్లే బాగుందిట. ఇంటి కంటే గుడి భద్రం అన్నారు." వా.

ఇంటికన్న గుడి పదిలము

  • సింహా. నార. 2.
  • చూ. ఇంటికంటే గుడి భద్రము.

ఇంటికాపు

  • గృహస్థు.

ఇంటికి కాక పోవు

  • ఇంటిపట్టున ఉండక పోవు. ఇంటికి పనికి రాక పోవు.
  • సాంబనిఘంటువులో ఇంటికి కాకపోవుట అనగా ముట్టగుట అని ఉన్నది. ఇది నేడు ఇలా వాడుకలో ఉన్నట్టు కనబడదు.
  • "ఉన్న ఒక్కకొడుకూ యింటికి కాకుండా పోయాడు." వా.
  • "ముగ్గురు కొడుకు లుంటే ముగ్గురూ మూడు ఊళ్లల్లో ఉద్యోగాలు చేస్తూ ఒక్కడూ యింటికి కాకుండా పోయాడు." వా.

ఇంటికి నిల్లు గట్టుకొని యేగు

  • ఇంటిల్లి పాదీ పోవు.
  • కుటుంబపరివార సమేతముగా ననుట.
  • "ఇంటికి నిల్లు గట్టుకొని యేగగ వచ్చు మురారివెంట నా, యింటికి వచ్చి పూజగొని యేగుట నన్ను గృతార్థు జేత." కకుత్థ్స. 2. 4.

ఇంటికుక్కలు

  • దాసులు, బానిసలు, ఆశ్రితులు.