పుట:PadabhamdhaParijathamu.djvu/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆక_____ఆక 107 ఆక_____ఆకా

ఆకటదూకట నలుగు

  • ఆకటిదప్పులచే బాధ చెందు.
  • "ఆకట దూకట నలిగితిరి." భా. 2. 124.

ఆకటిపంట

  • పోషకము.
  • ఆకలి తీర్చుట కనువైన పంట వంటి దనుట.
  • "..........సురసమూహము నాకటి పంటలు." పాండు. 1. 109.

ఆకట్టు

  • అడ్డగించు.
  • "డొల్లునీరంబు నాకట్ట జెల్లు గాక, డొల్లుగుణ మది మాన్పంగ జెల్లు నెట్లు?" కవిక. 4. 119.

ఆకయిల్లు

  • చెఱసాల.
  • "ఆకయింటి కావలివారు మేల్కని చూచి." భాగ. దశ. పూ. 148.

ఆకలి ఆఱిపోవు

  • ఆకలి మఱింత ఎక్కువైనప్పుడు అనుమాట.
  • "ఇంక అన్నం తినలేను. ఆకలి ఆరి పోయింది." వా.

ఆకలి చచ్చిపోవు

  • ఆకలి అడగిపోవు.
  • "వేళ మించిపోయి ఆకలి చచ్చి పోయిం దమ్మా?" కొత్త. 63.

ఆకలిచావు

  • తిండి లేక చనిపోవుట.
  • "బెంగాలు కరువులో ఆకలిచావులు విపరీతమై పోయినట్లు మనం పత్రికల్లో చదివాం." వా.

ఆకలి రుచి ఎఱుగదు

  • ఆకలివల్లనే రుచిగా ఉన్నది అన్న సందర్భంలో ఉపయోగిస్తారు.
  • "ఆకలి రుచెఱుగదు, నిద్ర సుఖ మెఱుగదు." సా.
  • "పది మైళ్లు నడిచి వెళ్లాను. మిట్ట మధ్యాహ్నం. ఆ మహాతల్లి అన్నం మాత్రమే ఉంది నాయనా అని అప్పటికప్పుడు నాలుగు మిరపకాయలు ఉప్పురాళ్లు విస్తట్లో నలిపి వేసింది. ఆ రోజు తిన్నానూ ఏం చెప్పను లే. అంత రుచైన భోజనం ఇంతదాకా మరి నా అనుభవములోకి రాలేదు. అందుకే ఆకలి రుచి యరుగదు అంటారు." వా.

ఆకల్లాడ్డం లేదు

  • గాలి యేమాత్రం లేదు. ఆకులు ఆడితే గాలివస్తుంది కదా.
  • "ఊరికే ఉక్క పోస్తూ ఉంది. ఆకల్లాడ్డం లేదు." వా.

ఆకారపుష్టి

  • వేషం మాత్రమే అనుట. ఆకారపుష్టి నైవేద్యం నష్టి.
  • "వాడి దంతా ఆకారపుష్టి. పొట్ట పొడిస్తే అక్షరంముక్క లేదు." వా.

ఆకాశంగద్ద తన్నుకు పోవు

  • సంబంధం లేనివాడు కాజేయు.
  • "వీడూ వాడూ ఆ ఆస్తికోసం వివాద పడుతూ ఉంటే అది కాస్తా ఆకాశం గద్ద తన్నుకు పోయింది." వా.