పుట:Oka-Yogi-Atmakatha.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"గంధబాబా" అద్భుతాల ప్రదర్శన

77

ఘాతాలు మానవుణ్ణి చివరికి, కేవలం సౌందర్యంతోనే ఆకర్షించే పరమాత్మ దగ్గరికి తోలతాయి.”

నేనూ ఆ సాధువూ కలకత్తా కాశీఘాట్ ఆలయంలో మాట్లాడుకుంటున్నాం; అద్భుత సౌందర్యానికి పేరుగన్న ఆ దేవాలయాన్ని దర్శించడానికే నేను వెళ్ళాను. అనుకోకుండా తారసపడ్డ ఈ పరిచయస్థుడు అలంకార ప్రాయమైన మందిరం ఘనతను ఒక్క చేతి విదిలింపుతో కొట్టిపారేశాడు.

“ఇటికలూ సున్నమూ, మన చెవులకు సోకే స్వరాలేవీ ఆలపించవు; తన ఉనికిని తెలిపే మానవగానం ఒక్కదానికే గుండె తెరుచుకుంటుంది.”

భక్త బృందాలు ఇటూ అటూ సాగుతున్న గుమ్మందగ్గర, మాకు ఆహ్వానమిస్తున్న ఎండలోకి ఇద్దరం నడిచాం.

“నువ్వు చిన్న వాడివి.” ఆ సాధువు సాలోచనగా నన్ను పరిశీలించాడు. “భారతదేశం కూడా చిన్నదే. సనాతన ఋషులు[1], ఆధ్యాత్మిక జీవనానికి సంబంధించి, నిర్మూలించడానికి శక్యంకాని పద్ధతులు ఏర్పరిచి ఉంచారు. వాళ్ళ సనాతన సూక్తులు ఈనాటికీ ఈ దేశానికి చాలు. భౌతికవాదం ఎన్ని కుతర్కాలు చేసినప్పటికీ, ఇవి పాతబడి పోలేదు; అనాగరికమూ కాలేదు. శిక్షణాత్మకమైన ఈ బోధలు భారతదేశాన్ని ఇప్పటికీ తీర్చి దిద్దుతున్నాయి. వేలకొద్ది సంవత్సరాలుగా - తత్తరపాటు పండితులు కాలగణన చేయడానికి ఖాతరుచేసే దానికంటె మిన్నగానే- సంశయాత్మక మైన కాలమే వేదాల విలువను రుజువుచేసింది. దాన్ని నువ్వు వారసత్వంగా తీసుకో.”

  1. ఋషు లంటే “ద్రష్టలు” అని అర్థం; కచ్చితంగా కాలనిర్ధారణ చేసి చెప్పడానికి వీలులేనంత సనాతనమైన వేదాలకు కర్తలు వీరు.