పుట:Oka-Yogi-Atmakatha.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"గంధబాబా" అద్భుతాల ప్రదర్శన

75

తన ఆలోచనల్ని నిర్విరామంగా పరిశీలనచేసుకోడం కఠోరమైన విదారక అనుభవం. అత్యంత ప్రబలమైన అహంకారాన్ని సైతం అది నుగ్గు చేస్తుంది. కాని నిజమైన ఆత్మవిశ్లేషణ, ద్రష్టలను తయారుచేయడానికి గణితశాస్త్రీయంగా పనిచేస్తుంది. ‘ఆత్మాభివ్యక్తి’ విధానం పేరిట సాగే వైయక్తికాభిప్రాయ ప్రకటనలు, దేవుణ్ణిగురించీ విశ్వాన్ని గురించీ తమకు తోచిన వ్యక్తిగతమైన వ్యాఖ్యానాలు చేయడానికి తమకు హక్కుందని విశ్వసించే అహంకారుల్ని తయారుచేస్తాయి.”

“అటువంటి దురహంకార పూరితమైన మౌలికత సమక్షం నుంచి సత్యం వినమ్రంగా వెళ్ళిపోతుందనడంలో సందేహం లేదు.” చర్చ నాకు ఆహ్లాదకరంగా ఉంది.

‘‘మనిషి, బడాయిల్లోంచి బయటపడేవరకు శాశ్వత సత్యాన్ని అర్థం చేసుకోలేడు. అనేక శతాబ్దాలుగా పంకిలమై ఉన్న మానవ మనస్సు లెక్కలేనన్ని ప్రపంచ మాయలతో కూడిన దుర్భర జీవితాన్ని సృష్టిస్తోంది. మనిషి మొదట, తనలోని శత్రువులతో జరిపే పెనుగులాటముందు, యుద్ధ భూమిలో జరిగే పోరాటాలు తీసికట్టే అనిపిస్తాయి! ప్రచండ బలప్రయోగంతో జయించడానికి, ఇవేమీ మానవ రూపంలో ఉన్న శత్రువులు కావు! విషవాయువుల్ని వెళ్ళగక్కే అస్త్రాలను బహునేర్పుగా అమర్చుకొని, అంతటా కమ్ముకొని, నిర్విరామంగా పనిచేస్తుండే, తామసిక కామాలనే ఈ యోధులు, మనల్ని అందరినీ హతమార్చడానికి చూస్తుంటారు. తన ఆదర్శాల్ని భుస్థాపితం చేసి సాధారణ ప్రారబ్ధానికి తలవంచినవాడు ఆలోచనాశూన్యుడు. అతడు నిర్వీర్యుడుగానూ, మూర్ఖుడుగానూ, అనుమానకరుడుగానూ తప్ప మరో రకంగా కనిపిస్తాడా?”

“అయ్యా, దిగ్భ్రమ చెందిన జనసామాన్యం మీద మీకు సానుభూతి లేదా?”