పుట:Oka-Yogi-Atmakatha.pdf/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం

69

“మర్నాడు రాము, బిడియపడుతూ లాహిరీ మహాశయుల దగ్గరికి వెళ్ళాడు. తనకున్న ఆధ్యాత్మిక సర్వసమృద్ధికి తోడుగా భౌతిక సంపద కోరుకోడం, దాదాపు అవమానకర మనిపించేటంతగా భావించాడతడు.

“ ‘స్వామీ, విశ్వాన్నంతనీ ప్రకాశింపజేసేవాడు మీలో ఉన్నాడు. అంతకంటె తక్కువ కాంతితో వెలిగే సూర్యుణ్ణి చూడగలిగేటట్టుగా ఆ భగవంతుడి వెలుగు నా కళ్ళలోకి వచ్చేటట్టు చెయ్యమని ప్రార్థిస్తున్నాను.’ అన్నాడు.”

“ ‘రామూ, నన్ను ఇరకాటంలో పెట్టడానికి, ఎవరో ఈ ఎత్తు వేశారు. నయం చేసే శక్తి నాకు లేదు,’ అన్నారాయన.”

“ ‘అయ్యా, మీలో ఉన్న పరమాత్ముడు తప్పకుండా నయం చెయ్యగలడండి.’

“ ‘అది వేరే సంగతి, రామూ! పరమాత్ముడి శక్తికి పరిమితి లేదు! అటు నక్షత్రాల్నీ, ఇటు శరీరంలో జీవకణాల్నీ నిగూఢమైన తన ప్రాణశక్తితో ప్రజ్వలింపజేసే పరమాత్ముడు నీ కళ్ళకి తప్పకుండా వెలుగు ఇవ్వగలడు,’ అంటూ గురువుగారు, రాము ముఖంలో కనుబొమల మధ్య ఉండే బిందువు[1]ను స్పృశించారు.

“ ‘నీ మనస్సును ఏడు రోజులపాటు అక్కడ కేంద్రీకరింపజేసి ఉంచి, తరచుగా రామ[2] నామం జపిస్తూ ఉండు. సూర్యుడి తేజోబింబం నీ కోసం ప్రత్యేకంగా ఉదయిస్తుంది,’ అన్నారు.

  1. “ఒంటి” కన్ను లేదా జ్ఞాననేత్రం ఉండే స్థానం. మామూలుగా మరణ సమయంలో మనిషిలో ఉన్న చైతన్యాన్ని పవిత్రమైన ఆ స్థానానికి లాగెయ్యడం జరుగుతుంది. చనిపోయినవాళ్ళ కళ్ళు పైకి తిరిగి ఉండడానికి కారణం ఇదే.
  2. రామాయణమనే సంస్కృత కావ్యంలో ప్రధాన పాత్ర అయిన పవిత్రమూర్తి.