పుట:Oka-Yogi-Atmakatha.pdf/874

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

838

ఒక యోగి ఆత్మకథ

చాను. ఆయన, పలచని గడ్డంతో, మీసకట్టుతో, సుమారు పాతికేళ్ళ యువకుడిలా కనిపించాడు; మధ్యలో పాపిడి తీసిఉన్న పొడుగాటి జుట్టుకు వెనక, ధగధగ మెరిసే బంగారువన్నె తేజఃప్రభ ఏర్పడి ఉంది.

ఆయన నేత్రాలు శాశ్వత అద్భుతకాంతితో ఉజ్జ్వలంగా ప్రకాశిస్తున్నాయి; నేను చూస్తూ ఉండగానే అవి అనంతరీతులుగా మారిపోతున్నాయి. ఆయన అభివ్యక్తిలో ప్రతి ఒక్క దివ్యపరిణామంతో, ఆయన అందించిన జ్ఞానాన్ని నేను, సహజావబోధం ద్వారా అవగాహన చేసుకున్నాను. ఆయన భవ్యదృష్టిలో, అనేకకోట్ల లోకాల్ని భరించే శక్తి నాకు అనుభూతమయింది. ఆయన నోటిదగ్గర ఒక పవిత్ర పానపాత్ర (Holy Grail) ప్రత్యక్షమయింది; అది కిందికి దిగుతూ నా పెదవుల దగ్గరికి వచ్చి, మళ్ళీ తిరిగి ఏసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోయింది. కొన్ని క్షణాల తరవాత ఆయన మధురమైన వాక్కులు పలికారు; అవి, నా గుండెలోనే పదిలపరుచుకోవలసినంత వ్యక్తిగతమైనవి.

1950 లోనూ 1951 లోనూ నేను, కాలిఫోర్నియాలో మొజావే ఎడారి దగ్గర ఉన్న, ఎస్. ఆర్. ఎఫ్. ఆశ్రమంలో చాలాకాలం గడిపాను. అక్కడే నేను, భగవద్గీత అనువాదం చేసి, యోగంలో వివిధ మార్గాల్ని చూపించే వివరమైన వ్యాఖ్యానం[1] ఒకటి రాశాను.

  1. ప్రస్తుతం లాస్ ఏంజిలస్ నుంచి వచ్చే ‘సెల్ఫ్ రియలైజేషన్ మేగజైన్’ లోనూ, ‘యోగదా మేగజైన్’ లోనూ - యోగదా ఆశ్రమం, దక్షిణేశ్వరం, పోస్టు ఆరియాదా, 24 పరగణాలు, పశ్చిమ బెంగాలు - ధారావాహికంగా ప్రచురణ అవుతోంది.

    భగవద్గీత, భారతదేశానికి అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర గ్రంథం. అందులో శ్రీకృష్ణుడు తన శిష్యుడైన అర్జునుడికి చేసిన ఉపదేశం ఉంది. ఆధ్యాత్మిక మార్గదర్శిత్వానికి ఉపకరించే ఆయన మాటలు, సత్యాన్వేషకులు ఆచరణలో పెట్టడానికి ఉపయుక్తమైనవి; కాలావధి లేనివి.