పుట:Oka-Yogi-Atmakatha.pdf/855

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 48

కాలిఫోర్నియాలో ఎన్సినిటాస్‌లో

“గురూజీ, మీకు ఆశ్చర్యం కలిగించే ఒక్క సంగతి! మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు మేము ఈ ఎన్సినిటాస్ ఆశ్రమం నిర్మించాం; మీరు తిరిగి వచ్చిన శుభసందర్భంగా అందించే ‘స్వాగత బహుమానం’ ఇది.” శ్రీలిన్, సిస్టర్ జ్ఞానమాత, దుర్గా మా, మరికొందరు భక్తులు ముసిముసిగా నవ్వుకుంటూ నన్నొక ద్వారంగుండా, చెట్లనీడ పరుచుకున్న దారి వెంబడి నడిపించారు.

నీలి సముద్రంలోకి ప్రవేశించబోయే బ్రహ్మాండమైన ఓడమాదిరిగా ముందుకు పొడుచుకువచ్చినట్టున్న ఒక భవనాన్ని చూశాను. మొదట నోట మాటరాలేదు; ఆ తరవాత “ఆహాలూ, ఓహోలూ!” అటుతరువాత సంతోషాన్నీ కృతజ్ఞతనూ వ్యక్తం చెయ్యడానికి మనిషికి చాలనంత పద జాలాన్ని ఉపయోగిస్తూ ఆశ్రమమంతా పరిశీలించాను - అసాధారణంగా విశాలంగా ఉన్న పదహారు పెద్ద గదులు; ప్రతి గదీ మనస్సును ఆకట్టు కొనేటట్టు తీర్చిదిద్ది ఉంది.

పై కప్పు నంటేటంతగా ఎత్తయిన - పెద్దపెద్ద కిటికీలుగల బ్రహ్మాండమైన హాలు, పచ్చలూ మాణిక్యాలూ నీలాలు అందంగా అమర్చినట్టుగా పచ్చిక, సముద్రం, ఆకాశంగల వేదికమీద నిలిచినట్టుగా ఉంది. ఆ హాలులో పెద్ద నిప్పుగూటికి పైనున్న బడ్డీమీద క్రీస్తు , బాబాజీ, లాహిరీమహాశయులు, శ్రీయుక్తేశ్వర్‌గార్ల బొమ్మలు అమర్చి ఉన్నాయి;