పుట:Oka-Yogi-Atmakatha.pdf/853

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పడమటికి నా తిరుగుప్రయాణం

817

కాని నా గురువెవరూ కనిపించలేదు. 1925 లో ఒకనాటి రాత్రి నా గురువును పంపమని ప్రభువును గాఢంగా ప్రార్థించాను. కొన్ని గంటల తరవాత, శ్రావ్యమైన మృదుసంగీత ధ్వనులతో నాకు మెలకువ వచ్చింది. పిల్లంగోవులూ ఇతర వాద్యపరికరాలూ పట్టుకున్న దేవతల బృందం ఒకటి నా కంటికి అవుపడింది. గాలిలో దివ్యసంగీతం నింపుతూ ఆ దేవతలు మెల్లగా అదృశ్యమయారు.

“మర్నాటి సాయంత్రం, మొట్టమొదటిసారిగా, ఇక్కడ లాస్ ఏంజిలస్‌లో మీ ఉపన్యాసం ఒకటి విన్నాను, దేవుడు నా ప్రార్థనను మన్నించాడని అప్పుడు తెలుసుకున్నాను.”

ఇద్దరం ఒకరివేపు ఒకరు చూస్తూ మౌనంగా చిరునవ్వు నవ్వు కున్నాం.

“ఇప్పటికి పదకొండేళ్ళబట్టి నేను మీ క్రియాయోగ శిష్యుణ్ణి,” అంటూ కొనసాగించాడు శ్రీ డికిన్సన్. “అప్పుడప్పుడు ఆ వెండికప్పు సంగతి తలుచుకునేవాణ్ణి; వివేకానందగారి మాటలు కేవలం అలంకారికంగా అన్నవేమోనని నన్ను నేను సమాధానపరుచుకుంటూ ఉండేవాణ్ణి.”

“కాని క్రిస్మస్‌నాటి రాత్రి మీరు ఆ చెట్టుదగ్గర, నా చేతికి పెట్టె అందిస్తూ ఉండగా, నా జీవితంలో మూడోసారి, కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆ కాంతిపుంజాన్ని మళ్ళీ చూశాను. మరుక్షణంలో, నా గురువుగారు ఇచ్చిన కానుక - నలభై మూడు సంవత్సరాల కిందటే వివేకానందగారు భవిష్యత్ దర్శనం చేసిన కానుక - వెండికప్పు నా కంటబడింది!”[1]

  1. శ్రీ డికిన్సన్ స్వామి వివేకానందగారిని 1893 సెప్టెంబరులో కలుసుకున్నారు. పరమహంస యోగానందగారు పుట్టింది అదే సంవత్సరం (జనవరి 5న). యోగానందగారు మళ్ళీ పుట్టినట్టూ, భారతీయ దర్శనశాస్త్రాన్ని బోధించడానికి ఆయన అమెరికా వెళ్ళబోతున్నట్టూ వివేకానందగారికి తెలుసునని దీనివల్ల స్పష్టమవుతున్నది. శ్రీ డికిన్సన్ 89 ఏళ్ళ వయస్సులో కూడా మంచి ఆరోగ్యంగా, చురుకుగా ఉంటూ 1965 లో ‘యోగాచార్య’ అనే బిరుదు పొందారు; లాస్ ఏంజిలస్‌లో సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటయిన ఉత్సవంలో ఈ బిరుదు ప్రదానం జరిగింది. ఈయన తరచుగా పరమహంసగారితో కలిసి చాలాసేపు ధ్యానం చేస్తూ ఉండేవారు; క్రియాయోగ సాధన ఎన్నడూ మానకుండా, రోజుకు మూడుసార్లు చేస్తూండేవారు. యోగాచార్య డికన్సన్ 1967 జూన్ 30 న పోయారు. ఇంకో రెండేళ్ళకు పోతారనగా ఈయన, ఎన్. ఆర్. ఎఫ్. సన్యాసుల సమావేశంలో ప్రసంగించారు. ఆ సందర్భంలో, పరమహంసగారికి చెప్పడం మరిచిపోయిన ఆసక్తికరమైన అంశం ఒకటి శ్రోతలకు చెప్పారాయన. యోగాచార్య డికిన్సన్ ఇలా అన్నారు: “స్వామి వివేకానందగారితో మాట్లాడ్డానికి నేను ఉపన్యాసవేదిక ఎక్కి వెళ్ళినప్పుడు, నేను ఆయనకు సమస్కరించేలోగానే ఆయన ఇలా అన్నారు: “ ‘అబ్బాయ్, నువ్వు నీళ్ళకి దూరంగా ఉండాలి.’ ”

    (ప్రచురణకర్త గమనిక )