పుట:Oka-Yogi-Atmakatha.pdf/851

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పడమటికి నా తిరుగుప్రయాణం

815

“ఆ కానుక మీ కోసం ప్రత్యేకంగా తెచ్చాను.”

“ఆ వెండికప్పు కోసం నేను నలభైమూడేళ్ళుగా ఎదురుచూస్తున్నానండి! అదో పెద్ద కథ; ఇంతకాలం దాన్ని నా గుండెల్లోనే దాచిపెట్టుకున్నాను.” శ్రీ డికిన్సన్ సిగ్గుపడుతూ నావేపు చూశాడు. ఈ కథ నాటకీయంగా మొదలవుతుంది: నేను మునిగిపోతున్నాను, మా అన్నయ్య తమాషాకి నన్ను ఒక నీళ్ళ మడుగులోకి నెట్టేశాడు. అది పదిహేనడుగుల లోతుంది. నెబ్రాస్కా పట్నంలో ఉందది. అప్పటికి నాకు ఐదేళ్ళే. నేను రెండోసారి నీళ్ళలో మునిగిపోతూండగా, కళ్ళు మిరుమిట్లు గొలిపే వన్నెవన్నెల వెలుతురు ఒకటి కనిపించింది; చుట్టుపక్కలంతా ఆ వెలుతురుతో నిండిపోయింది. దాని మధ్యలో ఒక మనిషి ఆకారం కనిపించింది; ఆయన కళ్ళు ప్రశాంతంగా ఉన్నాయి; ఆయన చిరునవ్వు నాకు అభయమిస్తున్నట్టు ఉంది. నా శరీరం మళ్ళీ మూడోసారి మునకవేస్తూ ఉండగా మా అన్నయ్య స్నేహితుల్లో ఒకతను, సన్నగా పొడుగ్గా ఉన్న విలో చెట్టుకొమ్మ ఒకటి అందుకుని బాగా కిందికి వంచాడు; నిస్సహాయస్థితిలో ఉన్న నేను, దాన్ని వేళ్ళతో గట్టిగా పట్టేసుకున్నాను. పిల్లలందరూ కలిసి నన్ను ఒడ్డుకెక్కించి ప్రథమచికిత్స చేశారు.

“పన్నెండేళ్ళ తరవాత – పదిహేడేళ్ళ వయస్సులో - నేను మా అమ్మతో కలిసి షికాగో వెళ్ళాను. 1893 సెప్టెంబరు నెల అది. వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రెలిజియన్స్ (ప్రపంచ మత మహాసభ) అన్న మహాసభలు జరుగుతున్న రోజులవి. ఒక పెద్ద వీధిలో నేనూ మా అమ్మా కలిసి వెళ్తూ ఉండగా నేను మళ్ళీ ఉజ్వలమైన ఒక పెద్ద మెరుపు చూశాను. మాకు కొన్ని అడుగులముందు, నింపాదిగా నడుచుకుంటూ వెళ్తున్నాయన ఒకరు కనిపించారు. కొన్నాళ్ళ కిందట నాకు అంతర్దర్శనంలో కనిపించిన