పుట:Oka-Yogi-Atmakatha.pdf/850

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

814

ఒక యోగి ఆత్మకథ

ఉల్లిపొర కాయితాలు విప్పి, బంగారు జరీగల బనారసు పట్టుచీర ఒకటి పెట్టెలోంచి పైకి తీసిందావిడ.

“థాంక్యూ సార్; ఇది భారతదేశం కళా వైభవాన్ని కళ్ళకు కట్టిస్తోంది.”

“మిస్టర్ డికిన్సన్!” తరవాతి కానుక, నేను కలకత్తా బజారులో కొన్నది. “డికిన్సన్‌గారి కిది బాగా నచ్చుతుంది,” అనిపించింది నాకు, కొంటున్నప్పుడు. ప్రియశిష్యుడైన శ్రీ ఇ. ఇ. డికిన్సన్ 1925 లో మౌంట్ హషింగ్టన్ కేంద్రాన్ని స్థాపించినప్పటినించి ప్రతి క్రిస్మస్ మహోత్సవానికీ హాజరవుతున్నాడు.

ఈ పదకొండో వార్షికోత్సవంలో, ఆయన నా ఎదుట నిలబడి పొడుగాటి ఒక పెట్టెకు కట్టిఉన్న రిబ్బన్లు విప్పుతున్నాడు.

“వెండికప్పు!” భావోద్రేకంతో పెనుగులాడుతూ ఆయన, పొడుగాటి వెండికప్పు కేసి తేరిపారి చూశాడు. దిమ్మెర పోయినట్టు అయి దూరంగా ఒక కుర్చీలో కూర్చున్నాడు. శాంటా క్లాస్‌గా నేను నిర్వహిస్తున్న పాత్రను కొనసాగించేముందు, నేను ఆయనవేపు చూసి ఆప్యాయంగా చిరునవ్వు నవ్వాను.

కానుకలన్నీ ప్రసాదించే దేవుణ్ణి తలుచుకుని కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన జరపడంతో సాయంకాల కార్యక్రమం ముగిసింది; ఆ తరవాత సామూహికంగా క్రిస్మస్ గీతాల బృందగానం జరిగింది.

తరవాత ఒకసారి శ్రీ డికిన్సనూ నేనూ ఇష్టాగోష్టిగా ముచ్చటించుకున్నాం.

“సార్, నాకు వెండికప్పు ఇచ్చినందుకు మీ కిప్పుడు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను,” అన్నాడాయన.