పుట:Oka-Yogi-Atmakatha.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

ఒక యోగి ఆత్మకథ

నాన్నగారు ఆశించారు. కాని ఆయన అనుకొన్నది సూక్ష్మంగా తారుమారయింది : మా మాస్టరుగారు నాకు, బుద్ధికి పదును పెట్టేశుష్క విషయాలు బోధించకపోగా- అందుకు భిన్నంగా- భగవంతుడి సాక్షాత్కారం కోసం నాలో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఆకాంక్షను ప్రజ్వలింపజేశారు. నాన్నగారికి తెలియని విషయమేమిటంటే, స్వామీ కేవలానందగారు లాహిరీ మహాశయుల ఉత్కృష్ట శిష్యులన్న సంగతి. సాటిలేని ఆ మహాగురువులకు శిష్యులు వేలకొద్దీ ఉండేవారు. ఆయనకు గల దివ్యమైన ఆకర్షణ శక్తి అడ్డూ ఆపూ లేనిది కనక, వాళ్ళని ఆయనవైపు ఆకర్షించింది. లాహిరీ మహాశయులు తరచుగా, కేవలానందగారిని ఒక ఋషిగా పేర్కొంటూ ఉండేవారని నాకు తరవాత తెలిసింది.

మా ట్యూషన్ మాస్టరుగారి ముఖం, సమృద్ధిగా పెరిగిన వంకు లొంకుల జుట్టుతో తీర్చిదిద్దినట్టుండేది. నల్లటి ఆయన కళ్ళు, కల్లాకపటం తెలియని పసిపిల్లవాడి కళ్ళ మాదిరిగా నిర్మలంగా ఉండేవి. ఆయన పలచని శరీరంలోని కదలికలన్నీ ప్రశాంతమైన ఆలోచననీ గాంభీర్యాన్నీ ప్రదర్శించేవి. ఎప్పుడూ సౌమ్యంగా, ఎప్పుడూ ప్రేమగా ఉండే ఆయన, అనంత చైతన్యంలో స్థిరంగా నెలకొని ఉన్నవారు. మే మిద్దరం కలిసి అనేక గంటలకాలం గాఢమైన క్రియాయోగ సాధనలో ఆనందంగా గడుపుతూండేవాళ్ళం.

కేవలానందగారు ప్రాచీన శాస్త్రాల్లో, అంటే పవిత్ర గ్రంథ విషయాల్లో, అధికారికమైన పరిజ్ఞానం గల ప్రసిద్ధ పండితులు. ఆయన పాండిత్యమే ఆయనకు “శాస్త్రి మహాశయ” అన్న బిరుదు సంపాదించింది. అందరూ ఆయన్ని మామూలుగా ఆ పేరుతోనే పిలుస్తూండేవారు. కాని సంస్కృత పాండిత్యం సంపాదించడంలో నా అభివృద్ధి గమనించదగ్గదేమీ కాదు. నిస్సారమైన వ్యాకరణాన్ని విడిచిపెట్టేసి ప్రతిసారీ యోగాన్ని