పుట:Oka-Yogi-Atmakatha.pdf/829

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిరాహార యోగిని

793

ఆ సోదరుడి చిత్తశుద్ధి స్పష్టంగా కనిపిస్తోంది. మా చిన్న బృందం, ఆయనకు మనసారా ధన్యవాదాలు చెప్పి బియూర్‌కు దారి తీసింది. ఒక వీధిలో ఉన్న దుకాణం దగ్గర లూచీలూ (రొట్టెలు) కూరా కొనుక్కోడానికి మేము ఆగాం. శ్రీ రైట్, నిరాడంబరమైన హిందూ పద్ధతిలో వేళ్ళతో తింటూండగా, ఊళ్ళో పిల్లలు చుట్టూ మూగి, అతని వేపు కళ్ళప్పగించి చూస్తున్నారు.[1] ఆ మధ్యాహ్నం మాకు చాలా శ్రమ కలిగించబోయే ఆ సంగతి మాకు అప్పటికి తెలియదనుకోండి - ప్రయాణ ప్రయాసకు తట్టుకునేలా బలం చేకూర్చుకోడానికి వీలుగా మాకు కరకరా ఆకళ్ళు వేశాయి.

ఇప్పుడు మా దారి, బెంగాలులో బర్డ్వాన్ విభాగంలో, ఎండకు మాడిన వరిపొలాల గుండా, తూర్పువేపు సాగింది. రోడ్లకు ఎడాపెడా దట్టమైన చెట్లు బారులు తీర్చి ఉన్నాయి. మైనాలూ కంఠం మీద చారలుండే బుల్‌బుల్ పిట్టలూ పాడే పాటలు, పెద్ద గొడుగుల్లాంటి కొమ్మలున్న చెట్ల సందుల్లోంచి వినవస్తున్నాయి. అప్పుడొకటీ ఆప్పుడొకటి కనిపించే ఎడ్లబండ్ల కొయ్యచక్రాల ఇనప పట్టాలు ఇరుసూ ‘రినిరిని మంజుమంజు’ అంటున్నట్టు కీచుగా చప్పుడు చేస్తున్నాయి. నగరాల్లో తారురోడ్ల మీద కారుటైర్లు చేసే చప్పడుకు ఇది విరుద్ధం.

“డిక్, ఆపు!” అంటూ చటుక్కున నేను అనే సరికి, ఫోర్డు కారు, దానికి అభ్యంతరం చెబుతున్నట్టుగా ఒక్క కుదుపు కుదిపింది. “బరువు మొయ్యలేకపోతున్న ఆ మామిడిచెట్టు మనని కేకేసి పిలుస్తోంది చూడు!”

  1. శ్రీయుక్తేశ్వర్‌గారు అంటూండేవారు: “భగవంతుడు మనకి భూదేవి ఫలాలు ఇచ్చాడు. తిండిని చూడ్డం, వాసన చూడ్డం, రుచి చూడ్డం మనకి ఇష్టం- హిందువుకు దాన్ని తాకడం కూడా ఇష్టం;” భోంచేసేటప్పుడు ఇంకెవరూ దగ్గర లేకుండా ఉన్నట్లయితే, దాన్ని ‘వినడానికి’ కూడా అభ్యంతరం ఉండదు.