పుట:Oka-Yogi-Atmakatha.pdf/828

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

792

ఒక యోగి ఆత్మకథ

“గణేశుడు[1] మీకు తోడు వచ్చుగాక!” అన్నారు లంబోదరబాబు, నవ్వుతూ. మర్యాదగా ఇంకా ఇలా అన్నారు: “మీ రెప్పటికయినా అక్కడికి చేరడమే జరిగితే, గిరిబాల మిమ్మల్ని చూసి సంతోషిస్తుందన్నది ఖాయం. ఇప్పుడావిడ డెబ్బయ్యోపడిలో పడబోతోంది; అయినా ఆరోగ్యం దివ్యంగా ఉంది.”

“అయ్యా, ఒక్క మాట చెప్పండి, ఆవిడ ఏమీ తినరన్నది పూర్తిగా నిజమేనా?” మనస్సులో భావాల్ని బయలుపరిచే కిటికీల్లాటి ఆయన కళ్ళలోకి సూటిగా చూశాను.

“అది నిజం.” ఆయన చూపు నిష్కల్మషంగా, విశ్వసనీయంగా ఉంది. “ఏభై ఏళ్ళలో ఆవిడ ఒక్క ముద్దకూడా అన్నం తినగా నేను చూడలేదు. ఈ ప్రపంచం హఠాత్తుగా అంతమయినా నేను ఆశ్చర్యపోను కాని, మా అక్కయ్య అన్నం తింటోందంటే ఆశ్చర్యపోతాను!”

ప్రపంచంలో ఈ రెండు సంఘటనలూ అసంభవమైనవే కనక, ఇద్దరం ముసిముసి నవ్వులు నవ్వుకున్నాం.

“గిరిబాల తన యోగసాధనలకు, అలవి కాని ఏకాంతం కోసం ఎన్నడూ ఎదురు చూడలేదు,” అంటూ సాగించారు లంబోదర బాబు. “ఆవిడ జీవితమంతా, మా ఇంట్లోవాళ్ళ మధ్యా స్నేహితుల మధ్యా గడిచింది. ఆవిడ విచిత్ర స్థితికి వాళ్ళందరూ అలవాటు పడిపోయారు. గిరిబాల ఏదైనా తినాలని హఠాత్తుగా నిర్ణయించుకుంటే, వాళ్ళలో ఆశ్చర్యపోని వాళ్ళు ఒక్కరూ ఉండరు! హిందూ వితంతువుకు తగినట్టుగా మా అక్కయ్య, సహజంగా విశ్రాంతి జీవితం గడుపుతూంటుంది. కాని

పురులియాలోనూ బియూర్‌లోనూ ఉన్న మా వాళ్ళందరికీ ఆవిడ, అసాధారణ స్త్రీ అన్న సంగతి తెలును.”

  1. “ఆటంకాల్ని తొలగించేవాడు.” భాగ్యదేవత.