పుట:Oka-Yogi-Atmakatha.pdf/827

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిరాహార యోగిని

791

నిరాహార స్థితిలో ఉంటుందని తాము నిస్సందేహంగా నమ్ముతున్నట్టు మహారాజావారు నాకు స్వయంగా చెప్పారు.”

“స్థితిబాబు చెప్పిన ఈ కథ ఇరవై ఏళ్ళకు పైగా నా మనస్సులో నాటుకుపోయింది,” అంటూ ఇలా చెప్పి ముగించాను. “నేను ఆ యోగినిని కలుసుకోకముందే కాలప్రవాహం ఆవిణ్ణి కబళించెయ్యదు కదా అని, అప్పుడప్పుడు అమెరికాలో అనుకుంటూ ఉండేవాణ్ణి. ఈపాటికి చాలా వృద్ధురాలై ఉంటుందావిడ. ఇప్పుడు ఎక్కడ ఉంటోందో, అసలు బతికుందో లేదో కూడా నాకు తెలియదు. కాని, ఇంకొన్ని గంటల్లో మనం పురులియా చేరతాం; ఆవిడ సోదరుడికి ఒక ఇల్లుంది అక్కడ,” అన్నాను.

పదిన్నరకి మేము గిరిబాలగారి సోదరుడు, లంబోదర డేతో ముచ్చటిస్తున్నాం. ఆయన పురులియాలో వకీలు.

“మా అక్కయ్య బాగానే ఉంది. ఆవిడ ఒక్కొక్కప్పుడు ఇక్కడ నా దగ్గరే ఉంటూంటుంది; కాని ప్రస్తుతం, బియూర్‌లో మా ఇంట్లో ఉంటోంది.” లంబోదర బాబు మా ఫోర్డు కారు వేపు సంశయంగా చూశారు. “స్వామీజీ, బియూర్‌ దాకా లోపలికి ఇంతవరకు ఏ కారూ చొచ్చుకు వెళ్ళలేదనుకుంటాను. మీ రందరూ ఎడ్లబండి కుదుపులకు సిద్ధపడ్డమే మంచిదనుకుంటాను.”

మా బృందంలో అందరూ మా ఫోర్డు కారుపట్ల, ఏకగ్రీవంగా విశ్వాసం ప్రకటించారు.

“ఈ పోర్డు అమెరికా నుంచి వచ్చినది,” అని చెప్పాను ఆ వకీలుకు. “బెంగాలు నడిబొడ్డుతో పరిచయం చేసుకునే అవకాశం దానికి లేకుండా చెయ్యడం విచారకరమైన విషయం!”