పుట:Oka-Yogi-Atmakatha.pdf/826

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

790

ఒక యోగి ఆత్మకథ

పించాడు మా డ్రైవరు, కారు చప్పుడుకు అవి బెదిరిపోయే అవకాశం లేకుండా.

“సార్, ఈ నిరాహార యోగినిని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉందండి మాకు.”

“ఆవిడ పేరు గిరిబాల,” అని చెప్పాను నా సహచరులకు. “ఆవిణ్ణిగురించి చాలా ఏళ్ళకిందట, స్థితిలాల్ నంది అనే పండితోత్తములు చెప్పగా విన్నాను. ఆయన మా తమ్ముడు విష్ణుకు చదువు చెప్పడానికి తరచుగా గుర్పార్ రోడ్డు వీధిలో మా ఇంటికి వస్తూండేవారు.”

“గిరిబాలను బాగా ఎరుగుదును,” అని చెప్పారు స్థితిబాబు. తిండి తినకుండా బతకడానికి ఆవిడ ఒక యోగప్రక్రియ సాధన చేస్తుంది. ఇచ్ఛాపూర్[1] దగ్గర ఉన్న నవాబ్ గంజ్‌లో, మాకు పొరుగింట్లోనే ఉండేది ఆవిడ. ఆవిణ్ణి సన్నిహితంగా పరిశీలించడం నే నొక పనిగా పెట్టుకున్నాను. ఆవిడ ఏదైనా తిన్నట్టు కాని, తాగినట్టు కాని నా కెన్నడూ కనిపించలేదు. చివరికి నా ఆసక్తి ఎంతగా పెరిగిందంటే, నేను బర్డ్వాన్ మహారాజు[2] దగ్గరికి వెళ్ళి, ఒక పరీక్ష జరిపించమని అడిగాను. ఆ కథ విని ఆయన ఆశ్చర్యపోయి, ఆవిణ్ణి తమ రాజమందిరానికి ఆహ్వానించారు. ఆవిడ, ఆయన పెట్టే పరీక్షకు ఒప్పుకొని, ఆయన ఇంట్లోనే, తాళం పెట్టిన ఒక వాటాలో రెండు నెలలపాటు ఉంది. తరవాత మరోసారి రాజమందిరానికి వెళ్ళి ఇరవై రోజులపాటు ఉంది; మూడో పరీక్ష పదిహేను రోజులు జరిగింది. ఈ మూడు కఠిన పరీక్షల ద్వారా, ఆవిడ

  1. ఉత్తర బెంగాలులో.
  2. మహారాజ రాజశ్రీ సర్ విజయచంద్ మహతాబ్; ఇప్పుడు గతించారు. గిరిబాల విషయంలో ఆ మహారాజు జరిపించిన మూడు పరీక్షలకూ సంబంధించిన లిఖిత ఆధారం కొంత, ఆయన కుటుంబికుల దగ్గర ఉండడం ఖాయం.