పుట:Oka-Yogi-Atmakatha.pdf/814

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

778

ఒక యోగి ఆత్మకథ


గాంధీమహాత్ములకు నివాళి

“జాతిపిత అన్న పేరు ఆయనకు సార్థకమయింది; ఒక పిచ్చివాడు ఆయన్ని చంపాడు. వెలుగు ఆరిపోయినందుకు కోటానుకోట్లు విలపించిపోతున్నారు... ఈ గడ్డ మీద వెలిగిన వెలుగు మామూలు వెలుగు కాదు. ఆ వెలుగు ఈ దేశంలో వెయ్యేళ్ళు కనిపిస్తుంది; ప్రపంచం దాన్ని దర్శిస్తుంది.” 1948 జనవరి 30న న్యూఢిల్లీలో మహాత్మాగాంధీ హత్య జరిగిన కొద్దిసేపటికి, భారత ప్రధాని అన్నమాటలివి.

అంతకు కొన్ని నెలలముందు భారతదేశం, శాంతియుతంగా దేశ స్వాతంత్ర్యం సంపాదించుకుంది. 78 ఏళ్ళ వయస్సుగల గాంధీ గారి పని పూర్తి అయిపోయింది. తమ రోజులు దగ్గర పడుతున్నాయని ఆయన తెలుసుకున్నారు. ఆ విషాద సంఘటన జరిగిననాడు పొద్దున, “ఆభా, ముఖ్య మైన కాయితాలన్నీ ఇలా తీసుకురా,” అని మనమరాలితో చెప్పారాయన. “నే నివాళ జవాబులు రాసెయ్యాలి. రేపనేది ఇక లేకపోవచ్చు.” తమ చరమ భవితవ్య సూచనల్ని గాంధీ గారు తమ రచనల్లో అనేకచోట్ల వెల్లడించారు.

ఉపవాసాలతో చిక్కి శల్యమైన శరీరంలో మూడు పిస్తోలు గుండ్లతో మరణిస్తున్న మహాత్ములు, మెల్లగా నేలకు వాలుతూ, మౌనంగా క్షమాదానం చేస్తూ హిందూ సంప్రదాయపద్ధతిలో నమస్కరిస్తూ చేతులు పైకి ఎత్తారు.