పుట:Oka-Yogi-Atmakatha.pdf/803

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీమహాత్ములతో వార్ధాలో

767

మహత్తర ప్రయోజనాన్ని ఏకైక లక్ష్యాన్నీ మానవజాతికి తెలియజేశాడు; మన మందరం ఆశించి ఉండవలసిన మహదాశయ మిది; ఆయన ఒక్క క్రైస్తవమతానికే కాదు, యావత్ప్రపంచానికి సర్వదేశాలకూ సర్వజాతులకూ చెందినవాడని నా విశ్వాసం.”

వార్ధాలో నే నున్న చివరి రోజు సాయంత్రం, టౌనుహాలులో శ్రీ దేశాయి ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రసంగించాను. యోగశాస్త్రాన్ని గురించి నే నిచ్చే ఉపన్యాసం వినడానికి వచ్చిన జనం, సుమారు 400 మంది, ఆ గదిలో కిటికీల్లో కూడా కిక్కిరిసిపోయారు. నేను మొదట హిందీలోనూ తరవాత ఇంగ్లీషులోనూ ప్రసంగించాను. నిద్రపోవడానికి ముందు, గాంధీగారి దర్శనంకోసం మేము సకాలంలో ఆశ్రమానికి తిరిగి వచ్చాం, ఆయన ఆ సమయంలో ప్రశాంతంగా కూర్చుని ఉత్తర ప్రత్యుత్తరాలు చూసుకుంటున్నారు.

పొద్దుట 5 గంటలకు నేను నిద్ర లేచేసరికి, చీకటి ఇంకా తచ్చాడుతూనే ఉంది. పల్లె బతుకులో అప్పుడే కదలిక మొదలయింది; మొదట ఆశ్రమం గేటు దగ్గర ఒక ఎద్దుబండి, ఆ తరవాత నెత్తిమీద పెద్ద బరువు మోస్తున్న ఒక రైతును చూశాను. పొద్దుటి పలహారం అయిన తరవాత మేము ముగ్గురం, గాంధీగారి దగ్గర సెలవు తీసుకుంటూ ప్రణామాలు అర్పించడానికి వెళ్ళాం. ఆ సాధువు ఉదయ ప్రార్థనకు నాలుగు గంటలకే లేస్తారు.

“మహాత్మాజీ, సెలవు!” ఆయన పాదాలు ముట్టుకోడానికి నేను ముందుకు వంగాను. “మీ సంరక్షణలో భారతదేశం క్షేమంగా ఉంది.”

వార్ధా యాత్ర ముగిసిన తరవాత కొన్నేళ్ళు గడిచిపోయాయి. భూమి, మహాసముద్రాలు, ఆకాశం, యుద్ధంలో మునిగిన ప్రపంచంతో మలినమైపోయాయి. ప్రపంచ మహానాయకుల్లో గాంధీగారొక్కరే ఆయుధ