పుట:Oka-Yogi-Atmakatha.pdf/791

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాంధీమహాత్ములతో వార్ధాలో

755

మర్నాడు పొద్దున మేము తేనె పానకమూ పాలూ గోధుమ జావా తాగాం. గాంధీగారితోనూ సత్యాగ్రహులతోనూ భోజనానికి రమ్మని పదిన్నరకి మమ్మల్ని ఆశ్రమం వసారాలోకి పిలిచారు. ఈ రోజు వంటకాల్లో ఎర్రబియ్యం, కొత్తగా ఎంపికచేసిన కూరగాయలు, ఏలక్కాయ గింజలు కూడా ఉన్నాయి.

మధ్యాహ్నం ఆశ్రమ ప్రదేశంలో తిరిగాను. కొన్ని ఆవులు నదురూ బెదురూ లేకుండా మేత మేస్తున్న మైదానం వరకు తిరిగాను. గోరక్షణ అంటే గాంధీగారికి గాడమైన ఆసక్తి.

“ఆవు అనేది నా దృష్టిలో, మానవులకన్న తక్కువ స్థాయిలో ఉన్న మొత్తం జంతు ప్రపంచం కింద లెక్క; మానవుడి సహానుభూతులను మానవేతరాలకు కూడా విస్తరింపజేస్తుందది,” అని వివరించారు మహాత్ములు. “బతికే ప్రతి జీవిలోనూ తనను చూసుకోడానికి మానవుడు గోవును పూజించాలని పెద్దల ఆదేశం. సనాతన ఋషులు గోవును దైవ సమానంగా భావించడం సహజమే. భారతదేశంలో మనిషికి ఆవు మంచి తోడు; అది సర్వసంపత్ప్రదాత్రి. అది పాలివ్వడమే కాకుండా, సేద్యానికి కూడా ఉపయోగపడుతోంది. గోవు కరుణ రసాత్మక కావ్యం; ఆ సాధుజంతువులో కరుణే కళ్ళకి కడుతుంది. మానవజాతిలో లక్షలాది మందికి రెండో తల్లి అది. గోరక్షణ చేయడమంటే, భగవంతుడు సృష్టించిన మూగజీవాలన్నిటికీ రక్షణ ఇవ్వడమన్న మాట. సృష్టిలో నిమ్న శ్రేణివి నోరులేనివి కనక, వాటి పిలుపు అన్నిటికన్న శక్తిమంతంగా ఉంటుంది.”