పుట:Oka-Yogi-Atmakatha.pdf/784

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

748

ఒక యోగి ఆత్మకథ

రాంచీ విద్యాలయాన్ని సందర్శించారు; అది ఆ విద్యాలయాని కొక గౌరవం. ఆ సందర్భంలో ఆయన, అతిథుల అభిప్రాయాల పుస్తకంలో, దయతో ప్రశంసాపూర్వకమైన మాటలు కొన్ని రాశారు.

100 పౌనుల క్షీణకాయం గల ఆ సాధువులో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాలు ప్రస్ఫుటమవుతున్నాయి. స్నిగ్ధమైన ఆయన ధూమ్రవర్ణ నేత్రాలు జ్ఞానంతో, చిత్తశుద్ధితో, వివేకంతో వెలుగొందుతున్నాయి; ఈ రాజనీతిజ్ఞులు న్యాయ, సాంఘిక, రాజకీయ పోరాటాలు అనేకం జయించారు. గాంధీగారు భారతదేశంలోని లక్షలాది జనహృదయాల్లో స్థానం సంపాదించుకున్నంతగా, ప్రపంచంలో మరే నాయకుడూ సంపాదించుకోలేదు. “మహాత్ముడు” అంటూ ఆయనకు వచ్చిన ప్రసిద్ధ బిరుదం, ప్రజలు స్వచ్ఛందంగా ఆయనకు అర్పించిన నివాళి. వాళ్ళకోసమే ఆయన, తమ దుస్తుల్ని కొల్లాయిగుడ్డకు పరిమితం చేసుకున్నారు. చాలా వ్యంగ్యచిత్రాలకు ఎక్కిన ఆ కొల్లాయిగుడ్డ, అంతకు మించినదేదీ ధరించజాలని దళిత జనబాహుళ్యంలో తామూ ఒకరమన్న భావనకు చిహ్నమయింది.

“ఆశ్రమవాసులు పూర్తిగా మీ సేవకు హాజరుగా ఉంటారు; ఏ పని కావాలన్నా, దయచేసి వాళ్ళని అడిగి చేయించుకోండి.” శ్రీ దేశాయి మమ్మల్ని రాతగదిలోంచి అతిథిగృహానికి తీసుకువెళ్తూ ఉండగా, మహాత్ములు అప్పటికప్పుడు ఈ ముక్కలు రాసి, సహజ సౌమనస్యంతో నాకు అందించారు.

దేశాయిగారు మమ్మల్ని పండ్లతోటలగుండా, పూలతోటలగుండా నడిపించి జేలీ కిటికీలున్న ఒక పెంకుటింటికి తీసుకువెళ్ళారు. ముందరి దొడ్లో ఉన్న ఇరవై ఐదడుగుల నూతిని, పశువులకు నీళ్ళు పట్టడానికి ఉపయోగిస్తారని చెప్పారు; ఆ పక్కనే ధాన్యం నూర్చడానికి సిమ్మెంటు