పుట:Oka-Yogi-Atmakatha.pdf/779

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీయుక్తేశ్వర్‌గారి పునరుత్థానం

743

దైవభావాల సాపేక్షతలకు మించి మరేమీ కావని గ్రహిస్తూ, ఎప్పుడూ సంపూర్ణంగా దైవజాగృతిలోనే ఉన్నవారని నేను ఇప్పటికి తెలుసుకున్నాను.

“యోగానందా, నా జీవితాన్ని, మరణాన్నీ, పునరుత్థానాన్ని గురించిన సత్యాలు ఇప్పుడు నీకు చెప్పాను. నా కోసం బెంగపెట్టుకోకు; అంతకన్న, దేవుడి కల అయిన ఈ భూలోకం నుంచి సూక్ష్మ శరీరాచ్ఛాదితమైన ఆత్మలు ఉండే మరో భగవత్స్వప్న గ్రహానికి వెళ్ళిన నా పునరుత్థాన వృత్తాంతం ప్రతిచోటా చాటు! ప్రపంచంలో ఉన్న దుఃఖపీడిత, మరణభీత స్వప్న దర్శుల హృదయాల్లో కొత్త ఆశను చిగురింపజేస్తుందది.”

“ఔను గురుదేవా!” ఆయన పునరుత్థానంవల్ల కలిగిన ఆనందాన్ని నేను మనసారా ఇతరులతో పంచుకుంటాను!

“భూమిమీద నా ప్రమాణాలు, అసౌకర్యం కలిగించేటంత ఉన్నతమైనవీ, చాలామంది స్వభావానికి సరిపడనివీను. నిన్ను నేను తిట్టవలసిన దానికంటె ఎక్కువసార్లే తిట్టాను. నువ్వు పరీక్షలో నెగ్గావు; నీ ప్రేమ, నా మందలింపుల మబ్బుల్లోంచి దూసుకు వచ్చి ప్రకాశిస్తోంది,” అంటూ ఆయన, దయతో ఇంకా ఇలా అన్నారు; “నే నివాళ నీకు ఇంకో సంగతి కూడా చెప్పాలని వచ్చాను: ఇక ముందెన్నడూ నేను మందలిస్తూ తీవ్రంగా నీ వేపు చూడను. నిన్నింక తిట్టను.”

నా మహాగురువుల మందలింపులు ఎంతగా పోగొట్టుకున్నానో నేను! ఆయన తిట్టిన ప్రతి తిట్టూ నా కొక దీవెనగా ఉండేది.

“ప్రియాతి ప్రియమైన గురుదేవా! లక్షసార్లు తిట్టండి - ఇప్పుడు చివాట్లు పెట్టండి!”