పుట:Oka-Yogi-Atmakatha.pdf/770

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

734

ఒక యోగి ఆత్మకథ

మాదిరిగా దూసుకుపోవడానికికాని, పాలపుంతల మీదా నక్షత్రాంతరాళాలోనూ సెర్చిలైటులా మిలమిల్లాడడానికికాని, అత్యంత విస్తారమైన మానవ కల్పనాశక్తికి సామర్థ్యం ఉంది. కాని కారణలోక జీవులకు అంతకన్న గొప్ప స్వేచ్ఛ ఉంది. భౌతిక అవరోధంకాని, సూక్ష్మ అవరోధంకాని, కర్మబద్ధతకాని లేకుండా వాళ్ళు, తమ భావాల్ని తక్షణమే మూర్తరూపంలో అనాయాసంగా ప్రత్యక్షీకరించుకుంటారు.”

“భౌతికవిశ్వం మౌలికంగా ఋణవిద్యుత్కణాలతో (ఎలక్ట్రాన్‌లతో) ఏర్పడ్డది కాదని, అలాగే సూక్ష్మవిశ్వం మౌలికంగా ప్రాణకణిక (లైఫ్‌ట్రాన్) లతో ఏర్పడ్డది కాదని - నిజానికి ఆ రెండూ, సృష్టిని సృష్టికర్తనుంచి విడదియ్యడానికి మధ్యలో కలగజేసుకుంటున్నట్టు అనిపించే సాపేక్షతా నియమమనే మాయచేత ఖండితమై, విభాజితమైన భగవద్భావన తాలూకు సూక్ష్మతమ కణాలతో ఏర్పడ్డదనీ గ్రహిస్తారు.”

“కారణలోకంలో ఆత్మలు, ఒకదాన్నొకటి ఆనందమయ పరమాత్మ తాలూకు వైయక్తికీకృత బిందువులుగా గుర్తుపడతాయి; వాటి చుట్టూ ఉండే వస్తువులన్నీ భావవస్తువులే, కారణశరీరులు, కేవలం భావాలయిన తమ దేహాలకూ ఆలోచనలకూ ఉండే తేడా గమనిస్తారు. మానవు డొకడు కళ్ళు మూసుకొని మిరుమిట్లు గొలిపే తెల్లటి వెలుగును కాని, మందమైన నీలివన్నె మసక వెలుతురును కాని చూడగలిగినట్టే కారణ శరీరులు, కేవలం ఆలోచనల్నే చూడగలరు, వినగలరు, వాసన చూడగలరు, రుచి చూడగలరు, తాకగలరు. వాళ్ళు విశ్వమానవ శక్తితో ఏదైనా సరే సృష్టించేస్తారు, లయం చేస్తారు.”

“కారణ లోకంలో చావుపుట్టుకలు రెండూ భావనలోనే ఉంటాయి, కారణ శరీరులు నిత్యనూతన జ్ఞానం అనే అమృతంతోనే విందు చేసుకుంటారు. శాంతి అనే నీటి బుగ్గల్లోంచి పెల్లుబికి వచ్చింది తాగుతారు,