పుట:Oka-Yogi-Atmakatha.pdf/769

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీయుక్తేశ్వర్‌గారి పునరుత్థానం

733

చివరికి, స్వల్పమయిన మానవాత్మ విముక్తమయి, అమేయ సమృద్ధమయిన పరమాత్మతో ఐక్యమవుతుంది.”

ఉత్కృష్టమూ, అద్భుతమూ అయిన కారణలోకాన్ని గురించి మరీ కొంత చెప్పమని గురుదేవుల్ని అర్థించాను.

“కారణ శరీరం, చెప్పలేనంత సూక్ష్మమయినది,” అన్నారాయన. “దాన్ని అర్థంచేసుకోవాలంటే ఎవరికయినా, తాము కళ్ళు మూసుకొని సూక్ష్మవిశ్వాన్నీ భౌతికవిశ్వాన్నీ సమస్తాన్నీ - గట్టిబుట్ట ఒకటి, కింద వేలాడుతూన్న ప్రకాశమానమైన గాలిబుడగ నంతటినీ భావాలరూపంలోనే దర్శించడానికి కావలసిన మహత్తర ఏకాగ్రతశక్తులు ఉండి ఉండాలి. అధిమానవసాధ్యమైన ఏకాగ్రతతో ఆ రెండు విశ్వాల్నీ, వాటి సంకీర్ణత లన్నిటితో సహా, కేవల భావాల్లోకి పరివర్తన చేయడంలో, లేదా పరిష్కారం చేయడంలో, కృతకృత్యుడు కాగలిగితే అప్పుడతడు కారణలోకాన్ని చేరి మనస్సుకూ పదార్థానికీ మధ్య సరిహద్దులో నిలబడతాడు. అక్కడతడు, ఘన ద్రవ వాయుపదార్థాలు, విద్యుత్తు, శక్తి, సర్వజీవులు, దేవతలు, మనుష్యులు, జంతువులు, మొక్కలు, సూక్ష్మజీవులు మొదలైన, సృష్టిలోని వస్తువులన్నిటినీ చైతన్యరూపాలుగా దర్శిస్తాడు; అంటే, మనిషి కళ్ళు మూసుకొని తన దేహం భౌతిక నేత్రాలకు కనబడకుండా కేవలం భావంగా మాత్రమే ఉన్నా కూడా తా నన్నవాడు ఒకడు ఉన్నాడని గ్రహించినట్టుగానే అన్నమాట.”

“మనిషి, ఊహలో చెయ్యగలిగిందల్లా కారణ శరీరుడు వాస్తవంగా చేస్తాడు. కేవలం మనస్సులో, ఆలోచనలో మొదటి కొసనుంచి తుదికొస దాకా సాగడానికికాని, ఒక లోకంనుంచి మరో లోకానికి మానసికంగా లంఘించడానికికాని, నిత్యత్వమనే కూపంలోకి అంతులేకుండా పడుతూ ఉండడానికికాని, నక్షత్ర మండలాల ముత్యాల పందిరిలోకి రాకెట్టు