పుట:Oka-Yogi-Atmakatha.pdf/763

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీయుక్తేశ్వర్‌గారి పునరుత్థానం

727

అన్నిటినీ భగవంతుడి సంతానంగానూ ఆయన వైయక్తికీకృత అభివ్యక్తులుగానూ గ్రహించి, వాళ్ళందరిమీదా దివ్యమైన, సమానమైన ప్రేమ చూపిస్తాడు.

“తనకు ప్రియమైనవాళ్ళ బాహ్యరూపాలు మారిపోయినప్పటికీ (దాదాపు వెనకటి జన్మలో వాళ్ళ కొత్తగుణాల వికాసానికి అనుగుణంగా) సూక్ష్మలోకవాసి, ఇతర జీవనస్తరాల్లో ఒకప్పుడు తనకు ప్రియంగా ఉన్నవాళ్ళనందరినీ గుర్తుపట్టడానికి తన అమోఘ సహజావబోధాన్ని ఉపయోగించి, వాళ్ళని తమ కొత్త సూక్ష్మలోక నివాసాలకు ఆహ్వానిస్తాడు. సృష్టిలో ప్రతి అణుపూ నశింపజేయరాని వ్యక్తిత్వం[1] ఏర్పడి ఉన్నది కనక, సూక్ష్మలోక మిత్రుడు ఏ దుస్తులు ధరించినప్పటికీ ఇతరులు అతన్ని గుర్తుపట్టేస్తారు; భూమిమీద నటుడు ఏ మారువేషంలో ఉన్నప్పటికీ నిశిత పరిశీలనవల్ల అతన్ని గుర్తు పట్టగలిగేటట్టే.

“సూక్ష్మమండలాల్లో మామూలు ఆయుఃప్రమాణం, భూమిమీద ఉన్నదానికన్న చాలా ఎక్కువ. ఏ వ్యక్తి అయినా ఒక సూక్ష్మగ్రహంలో కొంతకాలం ఉంటాడు; ఆ కాలపరిమితి అతన్ని, నియమానుసారంగా నిశ్చితమైన ఒక కాలంలో తిరిగి భూమండలానికి ఆకర్షించే భౌతిక కర్మభారాన్ని బట్టి నిర్ణయమవుతుంది. కొందరు జీవులు భౌతికంగా మరణించిన తరవాత వెంటనే భూమిమీదికి తిరిగి వచ్చేస్తారు. మామూలుగా దానికి కారణం, అలా తిరిగిరావాలని వాళ్ళకి బలమైన కోరిక ఉండడమే. చాలా మట్టుకు అభివృద్ధి సాధించిన వ్యక్తుల సూక్ష్మశరీర జీవితం సగటు ఆయుఃప్రమాణం, ఐదువందల ఏళ్ళ నుంచి వెయ్యేళ్ళవరకు ఉంటుంది. (భూలోక

  1. అణువు మొదలు మానవుడివరకు జీవరాశుల సృష్టికంతకూ కావలసిన ఎనిమిది మూలతత్త్వాలు: మన్ను, నీళ్ళు, నిప్పు, గాలి, ఆకాశం, చలనం, మనస్సు, వ్యక్తిత్వం (భగవద్గీత : 7 : 4).