పుట:Oka-Yogi-Atmakatha.pdf/758

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

722

ఒక యోగి ఆత్మకథ

రెండు కొంతమట్టుకు మూసుకొని ఉంటాయి. మూడోది, ముఖ్యమైన సూక్ష్మనేత్రం; ఇది నుదుటిమీద నిలువుగా, తెరుచుకొని ఉంటుంది. సూక్ష్మలోక మానవులకు కళ్ళు, చెవులు, ముక్కు, నాలిక, చర్మం అన్న బాహ్య జ్ఞానేంద్రియాలు అన్నీ ఉంటాయి; కాని వాళ్ళు, శరీరంలో ఏ భాగంతోనయినా సంవేదనలు పొందడానికి సహజావబోధమనే జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించుకుంటారు. మాటవరసకి, వాళ్ళు చెవితోకాని, ముక్కుతో కాని, చర్మంతోకాని చూడగలరు. కళ్ళతోటికాని, నాలికతోటికాని వినగలరు; చెవులతోకాని, చర్మం మొదలైనవాటితోకాని రుచి చూడగలరు.[1]

“మానవుడి భౌతిక శరీరం లెక్కలేనన్ని అపాయాలకు గురయ్యే విధంగా ఉంటుంది; అది ఇట్టే గాయపడుతుంది; లేదా అంగవైకల్యం పొందుతుంది. కాని ఆకాశతత్త్వ సంబంధమైన సూక్ష్మశరీరం అప్పుడప్పుడు కోసుకుపోవచ్చు, లేదా గాయపడవచ్చు; కాని అది ఇచ్ఛాశక్తి వల్ల వెంటనే నయమయిపోతుంది.”

“గురుదేవా, సూక్ష్మలోక వ్యక్తులు అందరూ అందంగా ఉంటారాండీ?”

“సూక్ష్మలోకంలో, అందమనేది ఆత్మపరమయిన గుణమేకాని బాహ్యరూపం కాదు,” అని జవాబిచ్చారు శ్రీయుక్తేశ్వర్‌గారు. “అంచేత, సూక్ష్మలోకవాసులు ముఖలక్షణాలకు ప్రాముఖ్యమియ్యరు. అయితే, సంకల్పమాత్రంచేత, నవీన సుందర సూక్ష్మశరీరాన్ని సృష్టించుకుని ధరించే హక్కు వాళ్ళకి ఉంది. భూమిమీద మనుషులు పండుగపబ్బాల్లో

  1. అటువంటి శక్తులకు ఉదాహరణలు, హెలెన్ కెలర్‌లా అరుదుగా కనిపించే వ్యక్తుల విషయంలో మాదిరిగా, భూమిమీద కూడా లేకపోలేదు.