పుట:Oka-Yogi-Atmakatha.pdf/753

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీయుక్తేశ్వర్‌గారి పునరుత్థానం

717

చేస్తాడు. కారణ శరీరం ధరించినవాడు, భావాల ఆనందమయలోకాల్లో ఉండిపోతాడు. కారణలోకంలోకి ప్రవేశించడానికో, పునఃప్రవేశానికో తయారవుతున్న సూక్ష్మలోక భక్తులతోనే నా పని.

“పూజ్య గురుదేవా, సూక్ష్మ విశ్వాన్ని గురించి ఇంకా చెప్పండి.” శ్రీయుక్తేశ్వర్‌గారు కోరినమీదట, నేను ఒక్కరవ్వ పట్టు సడలించినప్పటికీ, నా చేతులు మాత్రం ఇంకా ఆయన్ని చుట్టుకొనే ఉన్నాయి. నా దగ్గరికి రావడానికి యముణ్ణి చూసే ఎగతాళిగా నవ్విన మా గురుదేవులు, నిధులన్నిటినీ మించిన పెన్నిధి!

“సూక్ష్మశరీరులతో నిండిన సూక్ష్మలోకాలు చాలా ఉన్నాయి,” అంటూ ప్రారంభించారు గురుదేవులు. “అక్కడ ఉండేవాళ్ళు ఒక గ్రహం నుంచి మరో గ్రహానికి ప్రయాణం చెయ్యడానికి విద్యుత్తుకన్న, లేదా రేడియో ధార్మిక శక్తులకన్న వేగంగా సాగే సూక్ష్మ వాహనాల్ని, లేదా కాంతిపుంజాల్ని వాడతారు.”

“వెలుగు, వన్నెల సూక్ష్మ స్పందనలతో రూపొందిన సూక్ష్మ విశ్వం. భౌతిక విశ్వానికి కొన్ని వందలరెట్లు పెద్దది. భౌతిక సృష్టి యావత్తు, సూక్ష్మ మండలమనే ప్రకాశవంతమైన పెద్ద గాలిబుడగ కింద ఘనరూపమయిన ఒక చిన్న బుట్టలా వేలాడుతూ ఉంటుంది.