పుట:Oka-Yogi-Atmakatha.pdf/752

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

716

ఒక యోగి ఆత్మకథ

భక్తులు తప్ప, తక్కిన వాళ్ళలో ఎవరూ, సూక్ష్మమండలాల్లో అటువంటి ముక్తిదాయక కృషి ఫలప్రదంగా చెయ్యలేరు.[1] అప్పుడు, సూక్ష్మకర్మ లేశాలన్నిటినుంచీ తమ ఆత్మల్ని పూర్తిగా విముక్తం చేసుకోడానికి సాధకులు, హిరణ్యలోకంలో కొత్త సూక్ష్మశరీరాలతో తిరిగి పుట్టడానికి విశ్వనియమంచేత ఆకృష్టులవుతారు. నేనున్నది, సూక్ష్మలోక సూర్యుడనీ స్వర్గమనీ చెప్పే ఈ హిరణ్యలోకంలోనే. అక్కడివాళ్ళకి సహాయం చెయ్యడానికి అంతకన్న ఉన్నతమైన కారణలోకంలోంచి వచ్చి, దాదాపు పూర్ణసిద్ధి పొందినవాళ్ళు కూడా హిరణ్యలోకంలో ఉన్నారు.”

నా మనస్సు, మా గురుదేవుల మనస్సుతో పరిపూర్ణమైన అనుసంధానంలో ఉంది; మాటలతో మనస్సుకు హత్తించే చిత్రాల్ని ఆయన, కొంతవరకు వాక్కుద్వారాను, కొంతవరకు భావాల బదలాయింపుద్వారాను నాకు తెలియజేస్తున్నారు. ఆ విధంగా నేను ఆయన భావచిత్రాల్ని గబగబా ఆకళించుకుంటున్నాను.

గురుదేవులు ఇంకా ఇలా చెప్పారు: భగవంతుడు మానవుడి ఆత్మను వరసగా మూడు శరీరకోశాల్లో పొందుపరిచి ఉంచాడన్న సంగతి నువ్వు పవిత్ర గ్రంథాల్లో చదివావు - భావం, లేదా కారణ శరీరం; మానవుడి మానసిక, భావోద్రేక ప్రకృతికి స్థానమైన సూక్ష్మశరీరం; స్థూలమైన భౌతిక శరీరం. భూమిమీద మనిషికి భౌతిక జ్ఞానేంద్రియాలు ఏర్పడి ఉంటాయి. సూక్ష్మలోక వ్యక్తి, తన చేతనతోనూ అనుభూతులతోనూ ప్రాణకణిక (లైఫ్ ట్రాన్)[2] లతో తయారైన శరీరంతోనూ పని

  1. ఎంచేతంటే చాలామంది, సూక్ష్మలోకాల్లో ఉన్న అందాన్ని చూసి ఆనందిస్తూ, కష్టపడి ఆధ్యాత్మిక కృషి చెయ్యాల్సిన అవసరం ఉందన్న సంగతే గమనించరు.
  2. శ్రీయుక్తేశ్వర్‌గారు ‘ప్రాణ’ శబ్దం వాడారు; నేను దాన్ని లైఫ్‌ట్రాన్స్ అని (ఇంగ్లీషులోకి) అనువదించాను. హిందూ పవిత్ర గ్రంథాల్లో ‘అణువు’, ‘పరమాణువు’ అనే సూక్ష్మతర ఋణవిద్యుత్‌కణ (ఎలక్ట్రానిక్ ) శక్తులనేకాక, ప్రాణాన్ని, అంటే, “సృష్టించే ప్రాణకణికా శక్తి”ని ( క్రియేటివ్ లైఫ్‌ట్రానిక్ ఫోర్స్) కూడా ప్రస్తావించడం జరిగింది. అణువులు ఋణవిద్యుత్ కణాలూ అచేతన శక్తులు; ప్రాణం స్వభావతః, చేతనశక్తి, ఉదాహరణకు, శుక్ల శోణితాల్లో ఉండే ప్రాణకణికలు, కర్మానురూపంగా పిండం పెరుగుదలను నియంత్రిస్తాయి.