పుట:Oka-Yogi-Atmakatha.pdf/741

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల సన్నిధిలో చివరి రోజులు

705

యమునాతీర సైకతాలు బాలకృష్ణుడి స్మృతులతో పునీతమైనవి. ఆ దైవావతారమూర్తికీ ఆయన భక్తులకూ ఎప్పటికీ ఉండే దివ్య ప్రేమకు ప్రతీకగా ఆయన ఇక్కడ ముగ్ధమాధుర్యంతో గోపికలతో లీలా వినోదాల్లో మునిగి తేలాడు. చాలామంది పాశ్చాత్య వ్యాఖ్యాతలు కృష్ణభగవానుడి జీవితాన్ని అపార్థం చేసుకున్నారు; కేవల వాచ్యార్థ గ్రహణపరుల్ని పవిత్ర గ్రంథాల్లోని అలంకారికాభివ్యక్తి కలవరపరుస్తూ ఉంటుంది. ఒక అనువాదకుడి రాతలో వచ్చిన హాస్యాస్పదమైన తప్పు దీనికొక ఉదాహరణ. మధ్యయుగంలో జీవించిన రవిదాసు అనే చర్మకారుడు ఆత్మద్రష్ట అయిన సాధువు ఆయనకు సంబంధించిన కథ ఇది; అతడు మానవులందరిలోను మరుగుపడి ఉన్న ఆధ్యాత్మిక విభూతిని తన వృత్తికి సంబంధించిన సులువైన మాటలతోనే గానం చేశాడు:

విశాల వినీలాకాశం నీడలో
నివసిస్తాడు దేవుడు చర్మాంబరధారిగా.

రవిదాసు కవితకు ఒక పాశ్చాత్య రచయిత రాసిన అనాలోచిత వ్యాఖ్య విన్నప్పుడు, నవ్వు ఆపుకోలేక ఎవరయినా పక్కకి తిరిగి నవ్వుకుంటారు.

“తరవాత అతడు ఒక గుడిసె వేసుకొని, అందులో తాను చర్మంతో చేసిన ఒక బొమ్మ పెట్టుకుని పూజచెయ్యడం మొదలు పెట్టాడు,” అని రాశాడు.

రవిదాసు, మహానుభావుడైన కబీరుకు సోదర శిష్యుడు. రవిదాసు శిష్యశిఖామణుల్లో ఒకతె, చిత్తోడ్ రాణి. ఆమె ఒకసారి తన గురువుగారి గౌరవార్థం ఒక విందు ఏర్పాటుచేసి చాలామంది బ్రాహ్మల్ని భోజనానికి పిలిచింది. కాని వాళ్ళు, చెప్పులు కుట్టే అంత్యజుడి పక్కన కూర్చుని మేము భోంచెయ్యం అని అన్నారు. కాని దర్జాగా దూరంగా, మైలపడని