పుట:Oka-Yogi-Atmakatha.pdf/740

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

704

ఒక యోగి ఆత్మకథ

తరవాత మళ్ళీ ఆయన్ని దర్శించినందుకు అమితానందంలో మునిగి నేను ఆయన పవిత్ర పాదాలముందు సాష్టాంగ ప్రణామం చేశాను.”

“ ‘నే నిక్కడికి పిలిచాను నిన్ను,’ అంటూ చెప్పారు బాబాజీ. ‘అంచేతే నువ్వు దారితప్పి, నా తాత్కాలిక వసతి అయిన ఈ గుహకి రావడం జరిగింది. కిందటిసారి మనం కలుసుకుని చాలా కాలమయింది; మళ్ళీ మరోసారి నిన్ను పలకరించడం నాకు సంతోషం.’ ”

“ఆ అమర గురుదేవులు, ఆధ్యాత్మికంగా నాకు ఉపకారం చేసే కొన్ని మాటలతో నన్ను దీవించి, తరవాత ఇలా అన్నారు: “యోగానందకి నువ్వొక కబురు చెప్పాలి. అతను భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు నిన్ను చూడ్డానికి వస్తాడు. అతని గురువుకూ లాహిరీ శిష్యుల్లో ఇంకా బతికున్నవాళ్ళకీ సంబంధించిన అనేక విషయాల్లో అతను మునిగి ఉంటాడు. అప్పుడు అతనితో చెప్పు, అతను నన్ను చూడాలని ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు కాని, ఈసారి నే నతన్ని కలుసుకోననీ, మరో సందర్భంలో కలుస్తానని చెప్పు.’ ”

బాబాజీ పలికిన, ఈ ఓదార్పుతో కూడిన హామీ కేశవానందగారి నోట విని గాఢంగా చలించాను. నా గుండెలో ఉన్న మూగబాధ ఒకటి దీంతో తొలగిపోయింది; శ్రీయుక్తేశ్వర్‌గారు ముందే సూచించినట్టు, బాబాజీ నాకు కుంభమేళాలో కనిపించనందుకు మరి నేను దిగులు పడలేదు.

ఆశ్రమ అతిథులుగా ఒక రాత్రి అక్కడ గడిపి, మర్నాడు మధ్యాహ్నం మేము కలకత్తాకు బయలుదేరాం. యమునానది మీదున్న వంతెన మీదగా కార్లలో ప్రయాణం చేస్తూ, ఆకాశంలో సూర్యుడు నిప్పు రాజేసినట్టుగా, నిజంగా అగ్నిదేవుడి వన్నెల కొలిమిలాగున్న బృందావన ఆకాశరేఖ అద్భుత దృశ్యాన్ని కింద నిలకడగా ఉన్న నీళ్ళలో ప్రతిఫలిస్తూండగా తిలకించి ఆనందించాం.