పుట:Oka-Yogi-Atmakatha.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హిమాలయాలకు పారిపోతుంటే ఆటంకం

53

ఆ రైల్వే ఉద్యోగి తెచ్చిన తంతి కాయితం, ప్లాట్‌ఫారం మీద దొంగచాటుగా చదివేశాను. మా అనంతన్నయ్య దగ్గరినుంచి వచ్చిందది. దాంట్లో ఇలా ఉంది: “ఇంగ్లీషు దుస్తులు వేసుకున్న బెంగాలీ అబ్బాయిలు ముగ్గురు ఇంటినుంచి పారిపోయి, మొగల్ షరాయి మీదుగా హరిద్వారం వెళ్తున్నారు. నేను వచ్చేవరకు వాళ్ళ నక్కడ ఆపుచెయ్యండి. మీ సహాయానికి తగిన పారితోషికం దొరుకుతుంది.”

“అమర్, గుర్తులు పెట్టిన టైమ్‌టేబుళ్ళు మీ ఇంట్లో వదిలెయ్యొద్దని చెప్పానా నీకు?” అంటూ యద్దేవా చేస్తూ చూశాను. “అక్కడ మా అన్నయ్య కొకటి కనిపించి ఉంటుంది.”

మావాడు సిగ్గుపడుతూ, తప్పు ఒప్పుకొన్నాడు. మేము బెరైలీలో కాసేపు ఆగాం. అక్కడ మా కోసం ద్వారకాప్రసాద్[1] కాసుకొని ఉన్నాడు అనంతన్నయ్య ఇచ్చిన తంతి చేత్తో పట్టుకొని. మమ్మల్ని అక్కడ ఆపెయ్యడానికి గట్టిగా ప్రయత్నించాడు ద్వారక. అయితే మేమిలా పారిపోవాలన్న ప్రయత్నం, ఏదో సరదాకి తలపెట్టింది కాదని వాడికి నచ్చజెప్పాను. మాతోబాటు వాణ్ణికూడా హిమాలయాలకి వచ్చెయ్యమన్నాం; కాని కిందటి సారిలాగే, వాడు రానన్నాడు.

ఆ రాత్రి మా బండి ఒక స్టేషనులో ఆగి ఉండగా, మరో రైల్వే ఉద్యోగి వచ్చి అమర్‌ని లేపాడు. నే నప్పుడు సగం నిద్రలో ఉన్నాను. ఆయన కూడా, ఈ “థామస్,” “థాంప్సన్”ల సంకరజాతి ఆకర్షణలకు లోబడి మోసపోయాడు. ఆ రైలుబండి, తెల్లవారగట్లకు మమ్మల్ని విజయవంతంగా, హరిద్వారం చేర్చింది. రాచఠీవితో నిలిచిన కొండలు దూరంనుంచి, మమ్మల్ని రమ్మని పిలుస్తున్నాయి. స్టేషనులోంచి బయటికి దూసుకువచ్చి స్వేచ్ఛగా సంచరిస్తున్న నగర ప్రజల్లోకి వచ్చి పడ్డాం.

  1. ఇతన్ని గురించి 26 పుటలో వచ్చింది.