పుట:Oka-Yogi-Atmakatha.pdf/739

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల సన్నిధిలో చివరి రోజులు

703

రెండు గంటల తరవాత మమ్మల్ని భోజనాల గదిలోకి తీసుకువెళ్ళారాయన. నేను లోపల గాభరాపడి నిట్టూర్పు విడిచాను. మరో పదిహేను వంటకాల భోజనం! భారతదేశం ఆతిథ్యాన్ని అందుకోడం మొదలయి ఏడాది నిండకముందే నేను ఏభై పౌన్ల బరువు పెరిగాను! అయినప్పటికీ నా మీద గౌరవంతో ఏర్పాటుచేసిన అంతులేని విందుల్లో, శ్రద్ధగా వండిన వంటకాల్ని తిరస్కరించడం చాలా మొరటుతనం అనిపించుకుంటుంది. భారతదేశంలో (దురదృష్టవశాత్తు , మరెక్కడా కాదు!) బాగా లావెక్కిన సన్యాసిని ముచ్చటపడి చూస్తారు.

భోజనం అయిన తరవాత కేశవానందగారు నన్నొక మారుమూలకి తీసుకువెళ్ళారు. “నీ రాక మేము అనుకోనిదేమీ కాదు,” అన్నారాయన. “నీకో కబురు చెప్పాలి.”

నేను ఆశ్చర్యపోయాను. కేశవానందగారి దర్శనానికి వెళ్ళాలన్న ఊహ నేను ఎవరికీ చెప్పలేదు.

“కిందటేడాది నేను, బదరీనారాయణానికి దగ్గరలో ఉత్తర హిమాలయాల్లో తిరుగుతూ ఉండగా దారి తప్పిపోయాను. విశాలమైన ఒక గుహలో తలదాచుకోడానికి చోటు కనిపించింది. ఆ గుహలో రాతి నేలమీదున్న ఒక గుంటలో నిప్పులు కణకణా మండుతున్నా, గుహమట్టుకు ఖాళీగా ఉంది. ఈ ఏకాంతవాసంలో ఉండే ఆయన ఎవరా అని ఆలోచిస్తూ నేను, ఆ మంట దగ్గిర కూర్చున్నాను. గుహలోకి ప్రవేశించే దారిలో పడుతున్న ఎండమీద నా చూపు నిలిచిపోయింది.”

“ ‘కేశవానందా, నువ్విక్కడున్నందుకు సంతోషం.’ ఈ మాటలు నావెనకనుంచి వినవచ్చాయి. నేను చటుక్కున వెనక్కి తిరిగి అదిరిపడ్డాను; బాబాజీని చూసి అప్రతిభుణ్ణి అయాను! ఆ మహాగురువులు గుహలో ఒక మూల, భౌతికరూపంలో సాక్షాత్కరించారు. చాలా ఏళ్ళ