పుట:Oka-Yogi-Atmakatha.pdf/737

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల సన్నిధిలో చివరి రోజులు

701

అందులో లాహిరీ మహాశయుల పెద్ద ఫోటో ఒకటి ఉంది. ఆ స్వామికి తొంభయ్యో ఏడు దగ్గర పడుతోంది కాని, కండలు తిరిగిన ఆయన శరీరం బలాన్నీ ఆరోగ్యాన్నీ కనబరుస్తోంది. పొడగాటి జుట్టు, మంచులాటి తెల్లటి గడ్డం, ఆనందంతో మిలమిల్లాడే కళ్ళు గల ఆయన, మూర్తీభవించిన యథార్థ ఋషిపుంగవులు. భారతీయ గురువుల గురించి రాసే నా పుస్తకంలో ఆయన్ని గురించి కూడా చెప్పదలుచుకున్నానని నేను ఆయనకు తెలియజేశాను.

“మీ పూర్వ జీవితాన్ని గురించి కొంచెం చెప్పండి.” ప్రాధేయ పూర్వకంగా చిరునవ్వు నవ్వాను; మహాయోగులు సాధారణంగా మితభాషులు.

కేశవానందగారు వినమ్రతా భంగిమ ఒకటి చేశారు. “నా బాహ్య జీవితానికి సంబంధించింది. చాలా స్వల్పం. నిజానికి, నా జీవితమంతా హిమాలయాల్లో ఏకాంత ప్రదేశాల్లోనే గడిచిపోయింది; ప్రశాంతమైన ఒక గుహనుంచి మరో గుహకు నడిచి వెళ్తూ ఉండేవాణ్ణి. కొద్దికాలం నేను హరిద్వారానికి అవతల, చిన్న ఆశ్రమం ఒకటి నడిపాను; దాని చుట్టూ పొడుగాటి చెట్ల తోపు ఒకటి ఉండేది. ఎక్కడపడితే అక్కడ తాచుపాములు విచ్చలవిడిగా ఉంటూండడంవల్ల యాత్రికులు అక్కడికి వచ్చేవారు కారు. అది ప్రశాంతమైన ప్రదేశం,” అంటూ కేశవానందగారు ముసిముసి నవ్వు నవ్వారు. “తరవాత, గంగకు వరదవచ్చి, ఆ ఆశ్రమాన్ని తాచుపాముల్నీ కూడా ఊడ్చి పెట్టేసింది. అప్పుడు మా శిష్యులు ఈ బృందావన ఆశ్రమం కట్టడానికి నాకు తోడుపడ్డారు.”

మా బృందంలో ఒకరు ఆ స్వామిని, హిమాలయాల పులుల బారినుంచి ఎలా రక్షించుకోగలిగారని అడిగారు. కేశవానందగారు తల ఊపారు. ఆ ఉన్నత ఆధ్యాత్మిక ప్రదేశాల్లో అడవి జంతువులు యోగుల్ని పీడిం